కీసర, డిసెంబర్ 26: మాంజాలు ప్రాణాలు తీస్తున్నాయి.. ప్రమాదకరమైన చైనా మంజాలను నిలువరించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏటా మహానగరంలో విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నా.. ప్రభుత్వం మాత్రం నిద్రావస్తలో ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థి మెడకు మంజా తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
కీసరలోని పినింటి సుధాకర్‌రెడ్డి రెండో కుమారుడు జశ్వంత్‌రెడ్డి ఈసీఐఎల్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. శుక్రవారం జశ్వంత్‌రెడ్డి కీసరలోని తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి, తిరిగి ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గాలిపటాలకు వదిలేసిన మాంజా వచ్చి జశ్వంత్‌రెడ్డి మెడకు చుట్టుకుంది. మెడ కోసుకుపోయి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని కీసరలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా, వైద్యులు 19 కుట్లు వేశారు. కాగా, పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించకపోవడంతో నిషేధిత చైనా మాంజాలను అడ్డదారిలో పలువురు వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నారు.