ఏ పంటకు ఏ యంత్రం వాడాలి..? ఏ మందులు ఉపయోగించాలి..? తక్కువ స్థలంలోనే అధిక దిగుబడులు సాధించడం ఎలా..? ఇలా అన్నదాతలకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు హైటెక్స్‌లో ‘కిసాన్ అగ్రి-23’ కొలువుదీరింది. ఈ ఎక్స్‌పోకు విశేష స్పందన వస్తున్నది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఆధునిక టెక్నాలజీతో కూడిన తీరొక్క యంత్రాలు, ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తున్నారు. నేటితో ఈ ఎగ్జిబిషన్ ముగియనున్నది.
మాదాపూర్, మార్చి 4: ఆధునిక యుగంలో వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు వ్యవసాయం అంటే కనీసం రెండు, మూడు ఎకరాల పొలమో, చెలకో ఉంటేనే సాధ్యమయ్యేది, కానీ నేడు వేయి గజాల స్థలంలోనే ఎకరాకు సరిపడా పంటలను వేసేలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు పంట పొలాలకు కావాల్సిన యంత్ర పరికరాలు, ఏ పంటలకు ఏ మందులు వాడాలి.. తక్కువ స్థలంలోనే ఎక్కువ దిగుబడి ఏ విధంగా తీయాలి వంటి వాటిపై పూర్తి అవగాహన కల్పించేందుకు మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో కిసాన్ అగ్రి ఎక్స్ పో 2023 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో వ్యవసాయం రంగానికి చెందిన అనేక అధునాతన యంత్ర పరికరాలతో పాటు పంటలకు కావాల్సిన ఉత్పత్తులు, పంట పొలాల్లో మందులను పిచికారీ చేసే డ్రోన్లు, నూతన టెక్నాలజీతో ఆవిష్కరించిన చెరుకు రసం వెండింగ్ మిషన్లు వంటి అనేక యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచారు.
తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన మెడవ్ బ్రీత్ ఆఫ్ క్వీలిటీ సంస్థ వారు వినూత్న ఆవిష్కరణతో కొబ్బరి పీచుతో వ్యర్థాలను కుళ్లబెట్టి మట్టిలా వాడి కూరగాయాలు, ఆకుకూరలతో పాటు స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీలను సైతం పండించేలా అవగాహన కల్పిస్తున్నారు. పైగా ఈ విధానంతో పంటలు పండించినట్లయితే సాధారణ వ్యవసాయంతో పోల్చితే 75 శాతం నీరు తక్కువ అవసరం అవుతుంది. ఈ విధానంతో పంటలు పండించాలంటే పొలంతో అవసరం లేకుండా కేవలం తక్కువ స్థలం ఉన్నా సరిపోతుంది. అందులోనే ఓపెన్ టాప్ గ్రో బ్యాగ్స్, లే ఫ్లాట్ గ్రో బ్యాగ్స్, గ్రో క్యూబ్స్, బల్క్ బ్లాక్స్ల్లో కొబ్బరి పీచును వేసి కొన్ని రోజుల పాటు వాటిలో కొంత మొత్తంలో ఎరువులను వేస్తే సరి. అవి కుళ్లిపోయినట్లు అనిపించగానే కావాల్సిన విత్తనాలను వేసి పంటలను పండించవచ్చు.
మనకు కాస్త స్థలం ఉన్నా ఇంట్లోనో లేదా మిద్దెపై గాని ఎంచక్కా ఆకుకూరలను పండించవచ్చు. ఈ విధానాన్ని హైడ్రోపోనిక్ సిస్టమ్ అంటారు. ఇందులో కమర్షియల్, డొమెస్టిక్ సిస్టమ్ అనే రెండు విధానాలు ఉంటాయి. కమర్షియల్ అనగా మనకు ఎక్కడైనా వేయి గజాల స్థలం ఉందనుకుంటే వాటిలో గాలి చొరబడకుండా ఓ షెడ్డువలే నిర్మించి వాటిలో పాలియోస్, కూలింగ్ ప్యాడ్స్, ఫ్యాన్స్‌ను ఉపయోగించి ఎలాంటి మట్టితో పనిలేకుండా వాటర్ ప్లో అయ్యేలా స్టాండ్లను ఒకదానిపై ఒకటి అమర్చుతారు. స్టాండ్ కింది భాగంలో వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేసి వాటర్లోనే మొక్కల ఎదుగుదలకు కావాల్సిన మందులను ముందే కలుపుకుంటారు. స్టాండ్‌పై చిన్న పాటి తొట్టిలను ఏర్పాటు చేసి అందులో క్లే బాల్స్‌తో పాటు విత్తనాలను వేసి మొక్కలను పెంచుతారు. ఈ పద్ధతిని వేయి గజాల్లో ఏర్పాటు చేసుకోవాలనుకుంటే రూ. 8 నుంచి 9 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మెయిల్ కానీ ఫోన్ కానీ చేస్తే వాళ్లే వచ్చి సెటప్ చేసి మొక్కలను ఎలా పెంచాలో శిక్షణ ఇచ్చి వెళ్తారు. డొమెస్టిక్ సిస్టమ్ అంటే బాల్కానీ లేదా మిద్దెపై మొక్కలను పెంచుకునేందుకు వీలుగా సెటప్ చేసి వెళ్తారు. వీటిని 24 కిట్ల నుంచి ప్లాంట్లను బాల్కానీ, మిద్దె సైజును బట్టి సెటప్ చేస్తారు. 50ప్లాంట్ల నుంచి 200 ప్లాంట్ల వరకు స్టాండ్‌పై సెటప్ చేస్తారు. ఇందుకు రూ. 14.500 వేల నుంచి రూ. 29 వేల వరకు ఖర్చు అవుతుందని నిర్వాహకులు తెలిపారు.
షుగర్ కేన్ జ్యూస్ వెండింగ్ మెషిన్‌ను సరైన స్థలం ఉంచితే చాలు దానంతట అదే మనిషి లేకపోయిన పనిచేస్తుంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఈ చెరుకు రసం జ్యూస్ మెషిన్లో 100 కిలోల వరకు చెరుకు గడలను లోడ్ చేసి ఉంచితే చాలు దానంతట అదే నడుస్తుంది. మనిషితో ఎలాంటి పనిలేదు. జ్యూస్ కావాలనుకున్న కస్టమర్ మిషన్‌లోని డిజిటల్ డిస్ప్లే పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు, ఎన్ని గ్లాసులు చెరుకు రసం కావాలని అడుగుతుంది. అందులో 1 నుంచి 3 గ్లాసుల వరకు మాత్రమే ఉంటుంది. అలా ఎన్ని కావాలనుకుంటే అన్ని సార్లు ప్రెస్ చేసి డబ్బులను ఆన్లైన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పంపితే చాలు వెంటనే కూలింగ్‌తో కూడిన చెరుకు రసాన్ని కేవలం నిమిషంలోనే గ్లాసులో నింపి సిద్ధంగా ఉంచుతుంది. కస్టమర్ గ్లాసును తీసుకోగానే డోర్ మూసుకుంటుంది. పైగా ఎలాంటి డస్ట్ పడకుండా అన్ని విధాల సేప్టీగా ఉంటుంది. దీని ధర ఇంకా నిర్ణయించలేదు.
అధునాతన ఫీచర్లతో కూడిన రోబో డ్రోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇందులో ఫర్టిలైజర్స్, సీడ్స్‌తో పాటు కెమికల్స్ మిశ్రమాన్ని సైతం చల్లేలా డ్రోన్‌ను ఆవిష్కరించాం. ప్రస్తుతం 10 లీటర్ల ట్యాంకు సామర్థ్యంతో 1 సెట్ బ్యాటరీ కెపాసిటీతో డ్రోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. 3 ఎకరాల పొలానికి కేవలం 22 నిమిషాల్లోనే మందులను పిచికారీ చేస్తుంది. దీనికి 40 నిమిషాలు చార్జింగ్ పెడితే చాలు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 22 యూనిట్స్ కరెంట్ అవసరం అవుతుంది. దీని బరువు విత్ లోడ్‌తో కలిసి 25 కిలోలు ఉంటుంది. ప్రస్తుతం10 కిలోల డ్రోన్ ఉండగా దీని ఖరీదు 6.80 లక్షలు.
– రిషి (ఆగ్రో పైలెట్) ఐఐఐటీ, గచ్చిబౌలి
హైడ్రోపోనిక్ సిస్టంలో మామూలు స్థలంలో లేదా మిద్దె, బాల్కానీలో మొక్కలు, ఆకుకూరలను పెంచొచ్చు. ఇందుకోసం పాలియోస్ కూలింగ్ ప్యాడ్స్, చల్లదనం కోసం ఫ్యాన్లను ఉపయోగించి కేవలం 25 నుంచి 30 ఉష్ణోగ్రత ఉండేలా సెటప్ చేస్తాం. వీటికి ఖర్చు 8 నుంచి 9 లక్షలు అవుతుంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 15 కమర్షియల్, 40 కి పైగా డొమెస్టిక్ ప్లాంట్లను పూర్తి చేశాం. విజయవంతంగా ఆకుకూరలను పెంచుకుంటున్నారు.
– మనోజ్ కుమార్‌రెడ్డి, ఆగ్రోనామిస్ట్ (శ్రీ సాయి ఫైబర్ ప్రై. లిమిటెడ్)