మంగలోళ్లు లేకుంటే ఈ సమాజం ఏ తీరుగుంటదో ఒక్కపారి ఊహించుకోర్రి. శింపిరిజుట్టు వెంచుకొని, బారెడు గడ్డంతోని మాసివోయినట్టు కనవడదా? అంతెందుకు, ఎంతటి మనిషినైనా నోర్మూయించి ఆయనను నున్నగ తయారుజేసే ఐషత్ ఒక్క మంగలికే ఉన్నది. అసొంటి గొప్పదైన నా కులవృత్తిని నేను జేసుకొని బతికే భాగ్యం నాకు కలుగలేదు. అందుకే గీ యూసుఫ్‌గూడ రోడ్డు పొంటి శిన్న టేల వెట్టుకొని బతుకుబండిని గుంజుకొస్తున్న. ఇంతకు నా శేతు మంగలి కత్తి ఎందుకు వట్టలేదో ఎర్కేనా..?
మా నాన్న పేరు తాటికొండ నారాయణ. ఆర్మీల డ్రైవర్ డూటీ జేస్తుండె. ఆయనకు ఆరుగురం కొడుకులమైతే అన్ల నేను రెండోన్ని. 1974ల రాసిన పది పరీక్షలల్ల పాసైతే మంచిగనే ఉండుగనీ అన్ల రెండు దప్పిన. అప్పుడే మా నాన్నకు హైద్రావాద్ బొల్లారం నుంచి ఢిల్లీకి తబాదలైంది. ఆయనతోని నేన్గూడ ఢిల్లీలో కాలు వెట్టిన. మొదలు ఢిల్లీ కొత్తగనే అన్పించింది గనీ, కొన్నొద్దుల తర్వాత అదే అలవాటైంది. ఢిల్లీ, ఘాజియాబాద్ నా అడ్డా. ‘కూసొని తింటె గుట్టలైనా కరుగుతయ’నే మా నాన్న మాట నన్ను కిరాణా బాట వట్టించింది. మొదాలు ఓ కిరాణా దుకాన్ల పనికి కుదిరిన. తర్వాత మంగలి పన్నేర్సుకున్న. సేటుకు నా పని నచ్చిందో, లేకుంటే నా గుణం నచ్చిందో గని కొన్నొద్దుల తర్వాత నాతోని కూరగాయల దుక్నం వెట్టించిండు. అటు మంగలి పని, ఇటు కూరగాయల దుక్నం మూడు పూలు, ఆరుగాయలై పరుగులు వెడుతున్నది. నేనెక్కడుంటే అక్కడ సరదా సంకల్లేవట్టి డ్యాన్స్ జేస్తది. అందుకే ఆ ఢిల్లీల గూడ మస్తు మంది పోరగాండ్లు నాకు సోపతైన్రు.
ఢిల్లీ గల్లీల పొంటి కిర్కిట్ ఆడుడు, సినిమాలకు, షికార్లకు వోవుడు అప్పుడు మాకో ప్యాషన్. అందుకే పోరగాండ్లందరం గల్సి ఓ ఐతారం నాడు గోల్డెన్ టెంపుల్‌కు వొయ్నం. అదే రోజు రాత్రి తిరిగి బస్సుల ఢిల్లీకి అస్తున్నం. అండ్ల ‘యే దోస్తీ.. హం నహీ ఛోడేంగే.. ఛోడేంగే, ఛోడేంగే..’ అని మార్మోగుతనే ఉన్నది రేడియోల పాట. ఇగ మా దోస్తులందరు డ్యాన్సులు జేస్తనే ఉన్నరు. నేను గూడ సప్పట్లు కొట్టుకుంటా ఫుల్లు ఎంజాయ్ జేస్తున్న. హైవే రోడ్డుపై సడెన్‌గా ఓ పెద్ద మూల మలుపొచ్చింది. మమ్మల్ని ఓవర్టేక్ జేస్తూ వెళ్తున్న ఇంకో బస్సు మా బస్సును ‘ఢాం’ అని గుద్దింది. కిటీకి పక్కన కూసొని ఉన్న నాకు ‘ఢాం’ అని వచ్చిన శబ్ధమే యాదుంది. సీన్ కట్ జేస్తే.. ఢిల్లీ గేట్ దగ్గరి ఓ దవాఖాన్ల షరీఖై ఉన్న. కుడిశెయ్యి మొత్తం తెగి ఒక్క నరాల మీన్నే ఆగిందట. నా దోస్తుగాళ్లు దవాఖాన్లకు తీసుకొస్తే ఢిల్లీ డాక్టర్లు ఆపరేషన్ జేసిన్రు. నాటి నుంచి ఆ శెయ్యి ఉన్నట్టే గని సక్కగ పన్జెయ్యదు. మంగలి పన్జెయ్యాల్నంటే రెండు శేతులు సక్కగుండాలె. ఒక్క శెయ్యితోని ఏడ జెయ్యొస్తది?
యాక్సిడెంట్ అయినంక ఏడాదికి నాన్న దిగిపోతే అందరికందరం హైద్రావాద్ యూసుఫ్‌గూడ బస్తీకి వచ్చినం. వచ్చిన ఏడాదికి నాన్న నారాయణ కాలం జేసిండు. పేరుకు నౌకరిగాని కుటుంబం అన్నట్టే గనీ ఆస్తిపాస్తులేం లెవ్వు. నాన్న గిఫ్ట్ కింద ఇచ్చిన 25 గజాల భూమే మాకు ఆదెరువు. ఆ భూమి డెవలప్మెంట్కు ఇస్తే సింగిల్ బెడ్రూం ఇస్తనని ఆశవెట్టిండు డెవలపర్. సొంతంగా కట్టుకునే తాహత్ లేక డెవలపర్‌ను నమ్ముకుంటే వాడు ముప్పుతిప్పల వెడుతున్నడు. ఐదేండ్లాయె బిల్డింగ్ మొదలువెట్టి ఇంకా కడుతనే ఉన్నడు. రేపైపోద్ది, మాపైపోద్ది అనుకుంటా అరిగోస వెడ్తున్నడు. ఇగ గీ యూసఫ్‌గూడ రోడ్డు మీదున్న ఈ శిన్న టేలనే నా జీవనాధారం, మా కుటుంబానికి ఆసరా. అవును.. ‘ఆసరా’ అంటే గుర్తుకొచ్చింది. ఈ సర్కారొచ్చినంక రెండు నెలలకు వికలాంగుల కోటా కింద వచ్చే ‘పింఛన్’ ఊడవీకిర్రు. వికలాంగుల సర్టిఫికెట్ తీస్కవొయి ‘నా పింఛన్ ఎందుకు ఊడవీకిర్రు’ అని అధికారులనడిగితే జవాబు శెప్పేటోడు దిక్కు లేడు.
ఆ కథ అట్లుంటే ఇగ్గొ గీ కథ సూడుర్రి. 2025, ఏప్రిల్ 6వ తారీఖు ఐతారం నాడు టేల తియ్యడానికి ఎప్పట్లెక్కనే పొద్దుగాళ్లొచ్చినం. మాకన్న ముందుగాళ్లనే మేల్కొన్నట్టున్నరు ముసుగు దొంగలు. టేలల ఉన్న సామాన్లన్నీ సదుర్కపోయిన్రు. శిన్న టేలల గూడ దొంగలు వడ్డరంటే.. ఇగ పల్లెటూర్ల పరిస్థితి ఏందో అర్థం జేస్కోవచ్చు. 2025, ఏప్రిల్ 5వ తారీఖు శనివారం నాడు రాత్రి 20 వేల సామాన్ తెచ్చివెడ్తే తెల్లారేసరికి మాయమైంది. ఈ పోలీసోళ్లేం జేస్తున్నరో, ఈ నాయకులేం జేస్తున్నరో నాకర్థమైతలేదు. నాకైతే అసలు రాష్ట్రంల గవర్నమెంటున్నదా అనే డౌటు గొడ్తున్నది. ఇగ ఈ పోలీసోళ్లదో కథ. నా టేలల దొంగలు వడ్డరు సారూ అని జూబ్లీహిల్స్ టేషన్కు వోతే నన్ను పట్టించుకున్నోళ్లు లేరు. కనీసం కేసైనా ఫైల్ జేసిర్రా? జేస్తే.. ఓ పేపరైనా ఇయ్యిండ్రి అంటే.. ‘తాటికొండ నరహరినాత్ నువ్వు పెద్ద ఫోన్ కొనుక్కోపో’ అని గెదుముతున్నరు. ఇగ నేను పెద్ద ఫోన్ కొనుక్కోవాల్నంటే యూసుఫ్‌గూడ బస్తీల ఉన్న టేల గూడ అమ్ముకోవాలె. దొంగలు వడ్డంక ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినయంటే నేను ఏమో అనుకున్న గనీ, కనీసం ఆర్నెళ్లకైనా మొరిగితే మంచిగుండు.