Keesara Murder | కీసర, డిసెంబర్ 12: మర్డర్ జరిగిన కేసును కీసర పోలీసులు కేవలం 24 గంటల్లోపే ఛేదించారు. కేసు వివరాలు కీసర సీఐ వెంకటయ్య మీడియాకు వెల్లడించారు. కాప్రా మండలం ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉండే చినబోయిన కనకయ్యకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు మహిపాల్ డీజే ప్లేయర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కీసర మండలంలోని ఆర్జీకే కాలనీలో నివాసం ఉండే పృధ్వీరాజ్(27)తో మహిపాల్‌కు స్నేహం ఏర్పడింది. తరువాత వీరికి ఓ యువతి పరిచయమైంది. ఆ యువతి మొదట పృధ్వీరాజ్‌ను ప్రేమించగా.. అతను ఆమెను పెండ్లి చేసుకునేందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో కొన్నిరోజులు ఆ యువతి పృధ్వీరాజ్‌ను దూరంపెడుతూ తన వృత్తిలో భాగంగా మహిపాల్‌తో చనువుగా ఉంటున్నది. ఇది గిట్టని, పృధ్వీరాజ్ మహిపాల్‌పై కక్ష పెంచుకున్నాడు.
అతడిని చంపి ఆ యువతిని పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పృధ్వీరాజ్ పథకం ప్రకారం.. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం దమ్మాయిగూడకు వచ్చి వేరే వ్యక్తి ద్వారా పని ఉందని మహిపాల్‌ను పిలిపించి వైన్స్‌లో మద్యం తాగించాడు. అక్కడి నుంచి తన బండిపై ఎక్కించుకొని డంపింగ్‌యార్డు పక్కన ఆర్జీకే కాలనీ వెనుక గల కొండపైకి తీసుకెళ్లాడు. అక్కడ తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపి అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకొని విచారించగా.. పృధ్వీరాజ్ చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని కోర్టుకు రిమాండ్ చేశారు. కీసర పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.