Kid Selling Toys : పండుగ రోజంటే మనందరికి సెలవు రోజు. ఇంటిల్లిపాదితో ముచ్చట్లతో.. నోరూరించే రుచులతో ఆ రోజంతా సంతోషంగా గడుపుతాం. చిన్నపిల్లలైతే కొత్త దుస్తులు ధరించి స్నేహితులతో ఆడుకుంటూ సంబురపడిపోతారు. కానీ, ఈ అదృష్టం అందరికీ ఉండదుగా. పేదరికంతో పోరాడే వాళ్లకు పండుగైన పని దినమే. ఈ చిన్నారిని చూస్తే ఆ విషయం అర్ధమైపోతుంది.
రెక్కాడితేగానీ డొక్కాడదన్నట్టు.. క్రిస్మస్ రోజున ఈ పిల్లాడు రోడ్ల వెంబడి బొమ్మలు అమ్ముతూ కనిపించాడు. తలకు శాంతాక్లాజ్ టోపీ ధరించి చక్రాల బండిని లాగుతూ ‘బొమ్మలమ్మ.. బొమ్మలు’ అంటూ తిరుగుతున్నాడు. దారిన పోతున్నవాళ్లు ‘అయ్యో ఎవరి బిడ్డో.. ఇంత చిన్నవయసులోనే బతుకు బండి లాగేందుకు ఎన్ని తిప్పలు పడుతున్నాడో’నని అతడిపై జాలి చూపించారు. కానీ ఆ బాలుడు మాత్రం ఈ కష్టం నాకు అలవాటే అన్నట్టుగా ముందుకు సాగుతూ.. చిరునవ్వులు చిందిస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. చిన్నపిల్లలు అమితంగా ఇష్టపడే డోరెమాన్ డైనోసార్ వంటి కార్టూన్ బొమ్మలు అమ్ముతున్న ఆ బాలుడిని ‘నమస్తే తెలంగాణ’ కెమెరామెన్ క్లిక్‌మనిపించాడు.