సిటీబ్యూరో, అక్టోబర్ 26 ( నమస్తే తెలంగాణ ) : మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని రాష్ట్ర ఆటో సంఘాల నాయకులు తేల్చి చెప్పారు. కార్మిక వ్యతిరేక విధానాలతో సామాన్యుల జీవితాలను బీజేపీ నాశనం చేస్తున్నదని విమర్శించారు. బుధవారం ప్రగతి భవన్లో టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ, ఏఐటీయూసీ యూనియన్ల ఆటో సంఘాల నాయకులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు.
మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేస్తున్నామని.. ఇప్పటికే ఆటో సంఘాల నాయకులు ప్రచారంలో ఉన్నారని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్కేవీ నాయకుడు వేముల మారయ్య మాట్లాడుతూ..కరోనా క్లిష్ట సమయంలో ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో ఆటోడ్రైవర్లు కొట్టుమిట్టాడుతుంటే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కార్ వాహన మోటర్ పన్ను రద్దు చేసి అండగా నిలిచిందని తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించిన ఘనత తెలంగాణ సర్కార్‌దేనని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ చొరవతో జేఎన్ఎన్యూఆర్ఎం స్కీంలో భాగంగా సంగారెడ్డి అమీన్పూర్లో 400 మంది ఆటో డ్రైవర్లకు ఇండ్లు కేటాయించుకోగలిగామని చెప్పారు. అనంతరం ఏఐటీయూసీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశం మాట్లాడుతూ.. కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు. బీజేపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ నాయకులు పిల్లి శంకర్, టీఆర్ఎఎస్కేవీ ఆటో యూనియన్ నాయకులు యాట కృష్ణ, సాయి, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో టీఆర్ఎస్దే విజయం. వాహన కార్మికులకు అండగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్‌ది. కేంద్ర ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలతో పన్నులు చెల్లించలేక నష్టపోయాం. బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. మా డ్రైవరన్నల మద్దతు అంతా టీఆర్ఎస్కే.
-సూర్వి యాదయ్యగౌడ్, అధ్యక్షుడు, రాష్ట్ర లారీ సంఘం
ఆటో డ్రైవర్స్ మిత్రులకు రోడ్డు రవాణా పన్ను క్వాటర్లీ ట్యాక్స్ శాశ్వతంగా మాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. మా డ్రైవర్లకు ఒక పెద్ద దికుగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రైవేట్ సూల్ బస్సు డ్రైవర్లకు నెలకు 2,000 రూపాయలు, 25 కిలోల బియ్యం 10 వేల పైచిలుకు సూల్ బస్సు డ్రైవర్ లకు సర్కార్ అందించి అండగా నిలిచింది.
-సత్తిరెడ్డి, ఆటో యూనియన్ నాయకుడు
కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోయి ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉండి కార్ ఫైనాన్సర్ల బాధలు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్ఎంఈతో చర్చించి 6 నెలల నుంచి ఏడాది వరకు రీస్ట్రక్చర్ చేయించి ట్యాక్సీ డ్రైవర్లను ఆదుకున్నారు. కరోనాతో ఆర్థికంగా నష్టపోయిన ట్యాక్సీ డ్రైవర్ లకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ టాక్సీ డ్రైవర్లకు 35% సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాలు సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.
-సలావుద్దీన్, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ అసోసియేషన్