ఎర్రగడ్డ, ఏప్రిల్ 21: సుమారు 50 ఏండ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నలుగురు విద్యార్థులు జీవితంలో ఎంతో ఎదిగారు. ఉద్యోగాలు సంపాదించడమే కాకుండా.. అందులో రాణించి పదవీవిరమణ కూడా చేశారు. అయినప్పటికీ తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువును మరరిచిపోలేదు. తమకు చదువు నేర్పి ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి బంగారు బాట వేసిన గురువు కృష్ణ శర్మను ఇవాళ కలుసుకుని ఆత్మీయంగా పలకరించారు.
కృష్ణ శర్మ(87) 50 ఏండ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని ఆరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో హెడ్ మాస్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత పదోన్నతి పొంది విద్యా శాఖలో అధికారిగా విధులు నిర్వహించారు. 1996లో పదవీవిరమణ పొందారు. ప్రస్తుతం ఆయన కుటుంబం హైదరాబాద్ ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నది. ఆయన శిష్యులైన ఎ.కృష్ణమోహన్, ఎం.కృష్ణయ్య, జి.సురేందర్ బాబు, రామారావులు సోమవారం నాడు కృష్ణ శర్మ నివాసానికి వెళ్లి తమ గురువును ఎంతో ఆప్యాయతగా పలకరించి ఘనంగా సన్మానం చేశారు.