ఖైరతాబాద్, జూన్ 6 : ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరనున్నాడు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి చరిత్రలో మహాగణపతి విగ్ర ప్రతిష్ఠాపన 71 వసంతంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ ఏడాది 69 అడుగుల ప్రతిమను ప్రతిష్ఠించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామి వారి కుడివైపు పూరి జగన్నాథుడు, ఎడమ వైపు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, ఉప మండపాల్లో కుడి వైపు శ్రీ లక్ష్మి సమేత హయగ్రీవ స్వామి, ఎడమ వైపు శ్రీ గజ్జెలమ్మ దేవి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఐదు పడగల ఆదిశేషుడి నీడలో త్రిముఖుడై అష్టభుజాలతో దర్శనమిస్తారు.
మూల విగ్రహం 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, ఉప మండపాల్లో విగ్రహాలు 18 అడుగుల వరకు ఉండేలా శిల్పి రూపొందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం విగ్రహ నమూనాను ఆవిష్కరించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అశాంతి నెలకొంది. యుద్ధాలతో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ ఏడాది విశ్వసనామ సంవత్సరం కావడం వల్ల భక్తులు విశ్వాసంతో స్వామిని పదకొండు రోజుల పాటు సేవిస్తే విఘ్నాలను తొలగించే గణపతి విశ్వశాంతిని ప్రసాదిస్తారని చెబుతున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహప్రతిష్ఠాపనకు ఆంకురార్పణగా శుక్రవారం సాయంత్రం కర్రపూజ క్రతువు శోభాయమానంగా సాగింది. ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మె ల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి హాజరయ్యా రు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి రాజ్‌కుమార్, మహేశ్ యాదవ్ పాల్గొన్నారు.