సిటీబ్యూరో, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జనం శనివారం ప్రశాంతంగా కొనసాగింది. ఖైరతాబాద్ బడా గణేశ్, బాలాపూర్ వినాయకుడి నిమజ్జనాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలన్నీ సందడిగా మారాయి. అడుగడుగునా పోలీసు నిఘా మధ్య గణనాథుడి నిమజ్జన ప్రక్రియ సాగింది. 29 వేల మంది బందోబస్తుతో షిప్టుల వారీగా విధులు కేటాయిస్తూ ప్రధాన విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేశారు. గణేశ్ నిమజ్జనం సరళిపై బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరాల ద్వారా సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్‌సాగర్ వద్దే సుమారు 3వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. మొత్తం పోలీసు సిబ్బందితో పాటు అదనంగా 3200 మంది ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీ విగ్రహం తరలింపు వాహనానికి క్యూఆర్ కోడ్ జారీ చేయగా, ఇతర జిల్లాలు, కమిషనరేట్ల నుంచి వచ్చే వాహనాలకు రంగు స్టిక్కర్లు కేటాయించారు. 250 సీసీ కెమెరాలు, 9 డ్రోన్లతో గస్తీ నిర్వహిస్తున్నామని సీపీ చెప్పారు. ఎన్టీఆర్ మార్గ్‌లో అన్ని శాఖల అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయగా, ప్రతీ 100 మీటర్ల పరిధిలో మౌంటెడ్ వెహికల్స్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధానమైన ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహన్ని ప్రశాంతంగా నిమజ్జనానికి తరలించేందుకు శుక్రవారం కమిటీ నిర్వాహకులతో కలిసి పోలీస్ సిబ్బంది ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. శనివారం ఉదయం 7.41కు శోభాయాత్ర ప్రారంభమవ్వగా, 11.48 గంటలకు ఎన్టీఆర్‌మార్గ్‌లోని బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్దకు చేరుకున్నది. భక్తుల జయజయధ్వానాల మధ్య ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ మధ్యాహ్నం 1.45 గంటలకు సంపూర్ణమైంది. అలాగే బాలాపూర్ వినాయకుడి విగ్రహం కూడా మధ్యాహ్నం వరకు చార్మినార్‌ను దాటేసి సాయంత్రం వరకు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు.
ఖైరతాబాద్ బడాగణేశ్, బాలాపూర్ గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనం ప్రక్రియలంతా వడివడిగా మిగతా సాగాయి. ముందుగా అనుకున్నట్లు పక్కాప్రణాళికతో ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఆ తర్వాత బాలాపూర్ వినాయకుడు మండపం నుంచి కదిలాడు. డీసీపీ స్నేహమెహ్ర వాహనానికి ముందు నడుస్తూ బాలాపూర్ గణపతిని వడివడిగా నిమజ్జనం వైపు తరలించారు. గతంలో బాలాపూర్ గణేశుడి వెంట వందలాది వినాయక విగ్రహాలు తరలివెళ్తూ వైభవంగా ముందుకు సాగుతుంటే రహదారులన్నీ భక్తిపారవశ్యంతో మురిసిపోయేవి. అయితే పోలీసులు మాత్రం ఈ సారి అందుకు భిన్నంగా బాలాపూర్ గణేష్డిని వేగంగా నిమజ్జనం చేయించడమే లక్ష్యంగా ముందుకు సాగారు. పోలీసులు లాఠీలు పట్టుకొని ముందు నడుస్తుంటే.. వెనుక నుంచి వేగంగా బాలాపూర్ గణేశుడు ముందుకు సాగాడు.
నిమజ్జనం సందర్భంగా పోలీసులు మండపనిర్వాహకులను త్వరగా నిమజ్జనం చేయాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో కొందరు సాయంత్రం వరకు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నా, మరికొందరు మాత్రం సాయంత్రం సమయంలోనే నిమజ్జనానికి తరలించే కార్యక్రమాలను మొదలు పెట్టారు. కొన్నిచోట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో నిర్వాహకులు తాము పూజలు చేసుకోకుండా ఎలా కదిలించాలంటూ వాగ్వాదానికి దిగారు. మరికొన్ని చోట్ల ముందు చెప్పిన రూట్లో కాకుండా వేరే రూట్లో విగ్రహాలు తీయాలంటూ చెప్పడంతో నిర్వాహకులు తాము మాట్లాడుకున్న వాహనాల నుంచి సమస్య వస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విగ్రహాలను కదిలించాలంటూ ఒకవైపు ఒత్తిడిచేస్తూనే మరోవైపు రూట్స్ మార్చడంతో అంతా గందరగోళం ఏర్పడింది. ఖైరతాబాద్ బడాగణేశ్‌ను త్వరగా నిమజ్జనం చేయించడం, ఆ తరువాత బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం పూర్తయితే నిమజ్జన ప్రక్రియ మొత్తం పూర్తయిందనే భావనలో ఉన్న పోలీసులు.. నగరవ్యాప్తంగా ఈసారి నెలకొల్పిన పెద్ద విగ్రహాల తరలింపులో త్వరగా కదిలించాలనే ఆలోచన తప్ప ఒక ప్రణాళికతో చేయలేదనే విమర్శలు వినిపించాయి. అయితే నిమజ్జనం మొత్తం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవడం కొంత ఊరటనిచ్చింది.
నిమజ్జన కార్యక్రమం శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఊపందుకున్నది. నగర పోలీసులు ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై ఎక్కువగా దృష్టి సారించి, ఇతర విగ్రహాలను త్వరగా తీయాలంటూ ఒత్తిళ్లు చేశారు. అయినా కూడా మండపాల నిర్వాహకులు సాయంత్రం తరవాతే ఏర్పాట్లు చేస్తూ రాత్రి తమ నిమజ్జన కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యలో అర్ధరాత్రి వరకు కూడా చార్మినార్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు విగ్రహాలు బారులు తీరాయి. దీంతో పాటు సౌత్‌వెస్ట్ జోన్ పరిధిలో నుంచి వచ్చే వాహనాలు కూడా మొజంజాహి మార్కెట్ నుంచి ప్రధాన ర్యాలీలలో కలువడంతో ఆ ప్రాంతంలోనూ విగ్రహాలు బారులు తీరాయి.
బడంగ్‌పేట: గణనాథుల శోభాయాత్రలో భాగంగా నడుచుకుంటూ వస్తున్న ఓ వ్యక్తిని క్రేన్ ఢీకొట్టడంతో చనిపోయాడు. ఈ ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. జిల్లెలగూడ గాయత్రీనగర్ ప్రధాన రహదారిపై నడుచుకుంటూ పోతున్న పోరంకి రోజా శివ ప్రసాద్ బాబు (62) నడుచుకుంటూ వస్తుండగా, క్రేన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు సీఐ శంకర్ కుమార్ నాయక్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.