శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం గ్రేటర్లో పోలీసు పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అనేక కొత్త పోలీసు స్టేషన్లు కొలువుదీరనుండగా, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. రీ ఆర్గనైజేషన్‌లో భాగంగా ఖైరతాబాద్, సెక్రటేరియేట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఖైరతాబాద్‌కు బొల్లారం డీఐగా పనిచేస్తున్న పెరువాల నిరంజన్‌రెడ్డి ఖైరతాబాద్‌కు, చాదర్‌ఘాట్ డీఐగా పనిచేస్తున్న వి. బాలగోపాల్ సెక్రటేరియేట్‌కు నియమితులు కాగా, జూన్ 2 నుంచి అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
– ఖైరతాబాద్, మే 23
ప్రస్తుతం సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఖైరతాబాద్ పీఎస్‌ను ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్ రోడ్డులోని మెట్రో రెసిడెన్సి నుంచి ఆర్టీఏ కార్యాలయం, తాజ్‌కృష్ణ రోడ్డు నుంచి రోడ్డు నంబర్ 12 వరకు, కేర్, విరంచి హాస్పిటల్, చింతల్‌బస్తీ నాలా నుంచి షాదన్ కాలేజీ వరకు, షాదన్కాలేజీ నుంచి సైఫాబాద్ పీఎస్, ద్వారకాహోటల్, ఎక్బాల్ మినార్, మింట్ కాంపౌండ్, రోటరీ చౌరస్తా, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ లు ఈ పీఎస్ పరిధిలోకి వస్తాయి. పీఎస్‌కు ఒక సీఐ, డీఐ, 5 మంది ఎస్సైలు, పురుష, మహిళా ఎస్సైలతో కలిపి మొత్తం 83 మంది సిబ్బంది బాధ్యతలు చేపట్టనున్నారు. మూడు పెట్రో కార్లు ఇస్తారని సీఐ తెలిపారు. అలాగే సచివాలయం పరిధిలో….డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి అంబేద్కర్
విగ్రహం వరకు, సాగర్, బుద్ధభవన్ చౌరస్తా, రాణిగంజ్ చౌరస్తా నుంచి రైల్వే లైన్, నెక్లెస్‌రోడ్ మీదుగా రోటరీ చౌరస్తా వరకు వస్తాయి.
కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు సందర్భంగా ఆయా సెక్టార్ల పరిధిలోని కాలనీలు, బస్తీల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నేటి నుంచి నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు సైఫాబాద్, పంజాగుట్ట పీఎస్ పరిధుల్లోని పలు ప్రాంతాలు ఖైరతాబాద్, సెక్రటేరియేట్ పీఎస్‌లలో కలిశాయి. ఈ నేపథ్యంలో ఆయా పీఎస్ పరిధిల్లో ఉన్న ప్రజలు ఫిర్యాదులు అందించడంలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా అవగాహన కల్పించేందుకు నేరుగా సీఐ నేతృత్వంలో సిబ్బంది బస్తీలు, కాలనీల్లో పర్యటించనున్నారు. నేటి నుంచి వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు ఉంటాయని పోలీసులు తెలిపారు.