సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్, అక్రమాయుధాలు, సైబర్ నేరాల కేసుల దర్యాప్తులో పోలీసులు మూలాల వరకు వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తన్నాయి. చాలా కేసులలో చివరి వరకు వెళ్లకుండా ఆయా కేసుల దర్యాప్తును అంతకే ముగించేస్తున్నారు. ఆయా కేసులు ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాలతో ముడిపడి ఉండటమే ప్రధాన కారణమని పోలీసులు పేర్కొంటున్నా.. కీలక సూత్రధారులు ఆయా కేసులలో నుంచి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒడిశా, ఏపీ సరిహద్దుల నుంచి గంజాయి స్మగ్లింగ్ కావడం, రవాణా చేస్తున్న వాళ్లు హైదరాబాద్ పరిసరాలలో పట్టుబడటంతో అటూ అమ్మేవారు, ఇటూ కొనేందుకు కాంట్రాక్టు ఇచ్చిన వారు తప్పించుకొని పోతున్నారు. సైబర్నేరాలలో చాలా కేసులలో ప్రధాన సూత్రధారులను ట్రై పోలీస్ కమిషనరేట్లలో పోలీసులు పట్టుకోవడం లేదు.
ఇందుకు చాలా కారణాలుంటున్నాయి. కొన్ని కేసులలో సూత్రధారులు విదేశాలలో ఉండటం, మరికొన్ని కేసులలో సూత్రధారులు నేరానికి వాడిన ఫోన్ నంబర్, ఇంటర్నెట్ను వెంటనే మార్చేయడం, సాంకేతికంగా తమ ఆనవాళ్లు ఎక్కడా దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నేరాలకు పాల్పడుతున్న ఘటనలతో సూత్రధారులు తప్పించుకుంటున్నారు.
అక్రమాయుధాల కేసులలోనూ ఇతర రాష్ర్టాలలో అమ్మిన వారెవరు.. ఇక్కడ కొనేందుకు ప్రయత్నించిన వారెవరు అనే విషయాన్ని పోలీసులు అంతగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులతో అక్రమాయుధాలు విక్రయించేందుకు ప్రయత్నించిన వారు అప్పడప్పుడు చిక్కుతున్నారు. అలాంటి వారిని అరెస్ట్ చేసి ఆయా కేసులను అంతవరకే ముగించేస్తున్నారనే విమర్శలున్నాయి.
దొరికితేనే.. దొంగలు..
ఆయా కేసులలో మధ్యవర్తులుగా వ్యవహరించే వాళ్లే పోలీసులకు చిక్కుతున్నారు. కొన్ని కేసులలో సూత్రధారులు దొరికితేనే దొంగలవుతున్నారు, దొరకలేదంటే దర్జాగా బయట తిరుగుతున్నారు. అయితే ఇతర రాష్ర్టాలలో ఉండే నేరగాళ్లను పట్టుకోవడం కోసం పోలీసు శాఖకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం, నిధులు, తగిన సిబ్బంది లేకపోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. సూత్రధారులకు సంబంధించిన నేరస్తులు ఇక్కడ దొరికిపోయారంటే వెంటనే సూత్రధారులు తమ అడ్డాలను మార్చేస్తున్నారు. ఇక్కడ చిక్కిపోయిన నేరస్థులిచ్చిన సమాచారంతో ఇతర ప్రాంతాలలోకి వెళ్లి పోలీసులు గాలింపు చేపట్టినా అసలు సూత్రధారులు తప్పించుకుపోతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో డ్రగ్స్ కేసులలో డిమాండ్, సైప్లె గొలుసును తెగ్గొట్టేందుకు పోలీసులు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లారు. సైప్లె చేసేవాళ్లు ఎక్కడున్నా పట్టుకుంటామనే భయాన్ని కల్పించారు. అందుకు చాలా కేసులలో ఇతర రాష్ర్టాలలో ఉన్న సూత్రధారులను పట్టుకున్నారు. అయితే ఏడాదిన్నరగా ట్రై పోలీస్ కమిషనరేట్లలో ఆ పరిస్థితి లేదు. ఇటీవల ఈగల్‌కు భారీ ఎత్తున డ్రగ్స్ వినియోగదారులు, సరఫరాదారులు పట్టుబడ్డారు. అయితే ఇక్కడ పట్టుబడిన నేరస్థులిచ్చిన సమాచారంతో ఇతర రాష్ర్టాలలో ఉండే సరఫరాదారులను పట్టుకోవడం కోసం ప్రయత్నాలు సాగించాల్సి ఉందంటూ స్థానిక ప్రజలు సూచిస్తున్నారు.
సరికొత్త ప్ల్లాన్లతో..
ఇతర రాష్ర్టాలలో ఉండే నేరస్థులు హైదరాబాద్ వైపు చూడకుండా ఉండేలా గత పదేండ్లు పోలీసులు పకడ్బందీ ప్రణాళికలను అమలు చేశారు. తెలంగాణ పోలీసులను చూస్తే ఇతర రాష్ర్టాలలో ఉండే నేరగాళ్లలో వణుకు పుట్టే పరిస్థితి ఉండటంతో పాటు నేరస్థుల సర్కిళ్లలో హైదరాబాద్ వద్దు వెళ్లవద్దనే చర్చలు కూడా సాగిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో డ్రగ్స్, అక్రమాయుధాలు, సైబర్‌నేరాలకు సంబంధించిన నేరాలలో సూత్రధారులు కొత్త కొత్త ప్ల్లాన్లను అమలు చేసుకుంటున్నారు.
ఇందుకు మధ్యవర్తులుగా కొత్తవారిని నియమించుకుంటూ డ్రగ్స్ సరఫరాను చేయించడం, అక్రమాయుధాలను విక్రయించే ముఠాలను ప్రొత్సహించే పరిస్థితులు తీసుకొస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికైనా పోలీసులు ఆయా కేసులలో ఇప్పటికే తప్పించుకున్న సూత్రధారులను పట్టుకోవడం కోసం పకడ్బందీ ప్రణాళికలను అమలుచేయాల్సిన అవసరం ఉంది. పోలీసుల నిఘాకు దొరుకుతున్నవి కొన్నే, దొరకని వారు కూడా ఇంకా ఉండే అవకాశాలున్నాయని టాక్. కీలకమైన కేసులలో మూలాల వరకు వెళ్లి సూత్రధారులను పట్టుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.