శంషాబాద్ రూరల్, నవంబర్ 16 : గిరిజనులపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత కేతావత్ రామునాయక్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పుదోవ పట్టించడం కోసం తెలంగాణ వ్యాప్తంగా భూములు లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతినిత్యం వహిస్తున్న కొడంగల్‌లో అల్లుడి కంపెనీల కోసం అమాయకులైన గిరిజనులకు జీవనాధారమైన భూములను లాక్కునేందుకు చూస్తే ఊరుకునే ప్రసక్తేలేదన్నారు. గిరిజనులపై అమానుషంగా దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.