మేడ్చల్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ), కీసర : కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కార్మికశాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ సమక్షంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఈనెల 27 నుంచి మార్చి 4 వరకు జరుగనున్న జాతర ఏర్పాట్లకు సంబంధించి అధికారులందరూ సమన్వయంతో తమ విధులు నిర్వహించాలని సూచించారు. ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటికే కమిటీల ఏర్పాటు పూర్తిచేశామన్నారు. నగరానికి అతి సమీపంలో ఉన్న కీసరగుట్ట పుణ్యక్షేత్రానికి సుమారు ఐదు లక్షల మంది భక్తులు రానున్నందున, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, ఉత్సవాలు పూర్తయ్యే వరకు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వర్రావు, అధికారులు లింగ్యానాయక్, పద్మజా, మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.
కీసరగుట్టపై ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ హరీశ్ పరిశీలించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతిశర్మ, ఆలయ నిర్వహణాధికారి కట్టా సుధాకర్‌రెడ్డి వారిని శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, ఎంపీటీసీ తటాకం నారాయణశర్మ, ఆలయ ధర్మకర్తలు శ్రావణ్ కుమార్, రమేశ్‌యాదవ్, నరేశ్, సాయినాథ్ గౌడ్, మల్లారెడ్డి, బాల్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, రమేశ్, వెంకటేశ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.