సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ) : నాడు కేసీఆర్ సర్కారు చేపట్టిన భగీరథ ప్రయత్నం నేడు ఔటర్ రింగ్ రోడ్డు ప్రజల దాహార్తిని తీర్చనుంది. రూ.30 కోట్లతో నిర్మిస్తున్న ఉస్మాన్ నగర్ జంట రిజర్వాయర్లు దాదాపు లక్ష మంది జనాభాకు శుద్ధి చేసిన తాగునీరు అందించనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో విస్తరించిన గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటి సరఫరా చేసేందుకు గత ప్రభుత్వంలో జలమండలి ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్-2, ప్యాకేజీ 2 పనులకు శ్రీకారం చుట్టింది.
పటాన్ చెరు నియోజకవర్గంలోని ఉస్మాన్ నగర్ లో నిర్మిస్తున్న 4ఎంఎల్, 2ఎంఎల్ సామర్థ్యం కలిగిన జంట రిజర్వాయర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రిజర్వాయర్ల ఇన్లెట్, అవుట్ లెట్ నిర్మాణం పూర్తి కావడంతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఇటీవలే ఎలక్ట్రికల్ పనులు, క్లోరిన్ రూమ్ పనులు పూర్తి చేయగా అంతర్గత రహదారులు, సుందరీకరణ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయనున్నారు.
ఆహ్లాదం కోసం..
రిజర్వాయర్ ప్రాగణంలో సోలార్ ప్యానల్ తో లైట్లు ఏర్పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం గార్డెనింగ్, ల్యాండ్ స్కేప్ పనులు. మొక్కల పెంపకానికి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో గార్డెనింగ్ నిర్వహణ ,నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న రిజర్వాయర్లపై వివరాలతో కూడిన సైన్ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.
సాంకేతికతను ఉపయోగిస్తూ..
నీటివృథాను కట్టడి చేసేందుకు ప్రయోగాత్మక చర్యలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ రెండు రిజర్వాయర్ల నుంచి సరఫరా చేస్తున్న ప్రతి చుక్కనూ లెక్క కట్టేలాగా ఫ్లో మీటర్ పెట్టి, చివరి వినియోగదారుని వద్ద కూడా మీటర్ రీడింగ్ సరిపోయేలా లెక్క కడితే ట్రాన్స్ మిషన్ లాస్ తెలుస్తుంది. దాని ద్వారా వృథాగా పోతున్న నీటిని గుర్తించి దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకునే ఆస్కారం ఉండనుంది. డిస్టిబ్య్రూషన్ పైప్ లైన్ పై స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీతో లైన్ మెన్లు క్షేత్ర స్థాయిలో తిరగాల్సిన అవసరం లేకుండానే మొబైల్ యాప్ తో వాల్వులను నిర్వహించే విధంగా స్మార్ట్ వాల్వ్ ఏర్పాటు చేయనున్నన్నారు.
ఇంటర్ నెట్ ఆధారిత కమ్యూనికేషన్ తో ఆపరేట్ చేసే వాల్వ్ ఆపరేషన్ తో పాటు వాటర్ క్వాలిటీ, క్వాంటిటీ, క్లోరిన్ శాతం వివరాల్ని తెలుసుకునేందుకు ఆస్కారం ఉంది. ఈ స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీ పూర్తిగా సోలార్ ఎనర్జీ ఆధారంగా పనిచేయనుంది. మంగళవారం పనుల పురోగతిని పరిశీలించిన జలమండలి ఎండీ ఆశోక్‌రెడ్డి ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం ఇప్పటివరకు సనత్ నగర్ లో సమర్థంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రిజర్వాయర్ నీటి మట్టం, క్లోరిన్ శాతపు వివరాలను ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేసిన డాష్ బోర్డుకి అందేలాగా, ఒకవేళ రిజర్వాయర్ నుంచి సరఫరా చేస్తున్న నీటిలో క్లోరిన్ శాతం తగ్గితే వెంటనే సంబంధించిన అధికారులకు అలర్ట్ అందేలాగా ఆన్ లైన్ మానిటరింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్ – 2 స్వరూపం
ఓఆర్ఆర్ ఫేజ్ -2 ప్రాజెక్టును మొత్తం రూ.1200 కోట్ల వ్యయంతో చేపట్టగా కొత్తగా 71 సర్వీసు రిజర్వాయర్లు (140.50 మిలియన్ లీటర్ల సామర్థ్యం), 2758 కిలో మీటర్ల మేర నూతన పైపు లైను నెట్ వర్క్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయి రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తే మొత్తం 3.6 లక్షల కుటుంబాలు, 25 లక్షల జనాభాకు ప్రయోజనం కలగనుంది. చేయాలని నిర్ణయించారు. మొదటి ప్యాకేజీలో రూ. 613 కోట్లతో 33 సర్వీసు రిజర్వాయర్లు, 1522 కిలోమీటర్ల మేర పైపు లైను నెట్ వర్క్ నిర్మాణం చేపడుతున్నారు.
దీని పరిధిలోకి సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్ నగర్, ఇబ్రహీం పట్నం, ఘట్ కేసర్, కీసర (7 మండలాలు) ప్రాంతాల్లోని 4.36 లక్షల మంది దాహార్తి తీరనుంది. రెండో ప్యాకేజీలో కొత్తగా 38 సర్వీసు రిజర్వాయర్లు, 1250 కిలో మీటర్ల మేర పైపు లైను నెట్ వర్క్ నిర్మాణం చేపడుతుండగా వీటికయ్యే ఖర్చు రూ.587 కోట్లు. రాజేంద్రనగర్, శామీర్ పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, ఆర్సీపురం, బొల్లారం (5 మండలాలు) 1.96 లక్షల మందికి లబ్ది చేకూరనుంది.