రంగారెడ్డి, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేట్లు చేసిన నేపథ్యంలో బుధవారం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, కేసీఆర్‌కు మద్దతుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివెళ్లారు.
మాజీ మంత్రి సబితారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, షాబాద్ మాజీ జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల నుంచి వేలాదిగా పార్టీ నాయకులు తరలివెళ్లారు. బీఆర్కే భవన్ వద్ద కేసీఆర్‌కు అనుకూలంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
కేసీఆర్‌ను బద్నాం చేయడానికే..
తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయడంతోపాటు రైతాంగానికి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాలు సస్యశ్యామలంగా మారాయి. సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. ప్రజల్లో కేసీఆర్‌కు ఉన్న ఇమేజ్ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి ఆయనను విచారణకు పిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని విధానాల వల్ల రాష్ట్రం అధోగతి పాలైంది. కాంగ్రెస్ అభివృద్ధిని విస్మరించి సంక్షేమ పథకాలను మరిచిపోయింది. కేసీఆర్‌ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకుంది. కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌దే..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కుతుంది. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని విధాలుగా అన్యాయానికి గురైన తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలుచేయడం చేతగాక, నోటీసుల పేరుతో బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నది. ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయేది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది.
– షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి