దుండిగల్ ,జనవరి 12: ఇరుకిరుకు గదులు కాకుండా విశాలవంతమైన రెండు పడకల గదులతో ఇండ్లను నిర్మించి నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా డబుల్ బెడ్రూంలను అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కే దక్కిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌తో పాటు దుండిగల్ మున్సిపల్ చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ, కౌన్సిలర్, బీఆర్ఎస్ నేత శంభీపూర్ కృష్ణతో పాటు తదితరులు హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే సంకల్పంతో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందించిన మహానేత కేసీఆర్ అని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూంల సముదాయాలకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జక్కుల కృష్ణయాదవ్, గోపాల్‌రెడ్డి, శంభీపూర్ కృష్ణ, జక్కుల విజయ శ్రీనివాస్‌యాదవ్, ఆనంద్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.