ఖైరతాబాద్, సెప్టెంబర్ 16: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మహోన్నతంగా ఎదుగుతున్నదని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రసాద్ ఐమాక్స్ నుంచి పీవీ మార్గ్‌లోని పీపుల్స్‌ప్లాజా వరకు సమైక్యతా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె. ప్రసన్న, ఇన్చార్జి కలెక్టర్ అమయ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ సంతోషి, టీఆర్ఎస్ సోమాజిగూడ, వెంకటేశ్వరకాలనీ, జూబ్లీహిల్స్ కార్పొరేటర్లు వనం సంగీతా శ్రీనివాస్ యాదవ్, మన్నె కవితా రెడ్డి, వెల్దండ వెంకటేశ్‌తో కలిసి పాల్గొన్న మంత్రి తలసాని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు.
అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశంలోనే నం.1 స్థానంలో నిలబెట్టారని తెలిపారు. హైదరాబాద్‌ను సైతం ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దామన్నారు. త్వరలో ప్రారంభం కాబోతున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి దేశంలోని అణగారిన, తాడిత, పీడిత వర్గాలకు సమున్నత గౌరవం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు తెలంగాణ సమాజం తగిన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ అన్ని మతాల సంగమం అని తెలిపారు. 75 ఏండ్లలో జరగని అభివృద్ధిని తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసి చూపారని కొనియాడారు. విలీనంపై బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తున్నదని.. హైదరాబాద్‌ను భారత్‌లో కలిపేస్తానంటూ అప్పటి ప్రధాని నెహ్రూకు నిజాం లేఖ రాశారన్నారు. నిజాంను ప్రధాని నెహ్రూ రాజ్‌ప్రముఖ్‌గా నియమించారని గుర్తు చేశారు.
ఓర్వలేకే ప్రజల మధ్య చిచ్చు..
జాతీయ పార్టీల కుట్రలను ప్రతిఒక్కరూ గమనించాలి
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): గంగా యమునా తెహజీబ్‌గా వెలుగొందుతున్న తెలంగాణలో కొన్ని జాతీయ పార్టీలు మత చిచ్చు రేపాలని చూస్తున్నాయని.. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి వారి కుట్రలను తిప్పి కొట్టాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నగరాభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నాయని అన్నారు. యావత్ ప్రపంచానికి జాతీయతా భావాన్ని తెలిపేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారని వివరించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై మేయర్ హర్షం వ్యక్తం చేశారు.