NIMS | సిటీబ్యూరో: ఖరీదైన అవయవమార్పిడి శస్తచ్రికిత్సలను అవసరమైన నిరుపేద రోగులకు సైతం అందించాలనే సంకల్పంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం అవయవ మార్పిడి శస్తచ్రికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తూ తీసుకున్న నిర్ణయం ఎంతో మంది పేద రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తున్నది. పైసా ఖర్చులేకుండా పూర్తి ఉచితంగానే అవయవమార్పిడి శస్తచికిత్సలు చేయించుకోవడంతో పాటు తదనంతర వైద్యసేవలను సైతం ఉచితంగానే పొందుతున్నారు.
ప్రాణాలను కాపాడేందుకు….
ఒక్కో కిడ్నీ మార్పిడికి కార్పొరేట్లో సుమారు రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఖర్చవుతుంది. ఇక కాలేయ, గుండె మార్పిడి శస్తచ్రికిత్సకైతే బయట రూ.30లక్షల నుంచి రూ.40లక్షల వరకు ఖర్చవుతుంది. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌కు సైతం కార్పొరేట్లో రూ.25లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే ఈ బాధితుల్లో దాదాపు 80శాతం మంది నిరుపేద రోగులే కావడంతో వారు కార్పొరేట్ దవాఖానల్లో అవయవ మార్పిడి శస్తచికిత్సలు చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ప్రాణాలు కోల్పోయేవారు.
మరికొంత మంది ఉన్న ఆస్తిపాస్తులను అమ్ముకుని ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుని, జీవితాంతం ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు. నిరుపేదల ఆరోగ్య ఆక్రందనలను చూసి చలించిన నాటి కేసీఆర్ సర్కార్ ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలనే సంకల్పంతో ఖరీదైన అవయవమార్పిడి శస్తచ్రికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచిల ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది రోగులకు వందల కోట్ల రూపాయల విలువైన అవయవ మార్పిడి శస్తచ్రికిత్సలను ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నారు. గడిచిన మూడేండ్ల కాలంలో ఒక నిమ్స్ దవాఖానలోనే సుమారు 577 అవయవ మార్పిడి శస్తచ్రికిత్సలు జరిగినట్లు నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప తెలిపారు. ఈ మూడేండ్ల కాలంలో జరిగిన అవయవ మార్పిడి శస్త్రచికిత్సల మార్కెట్ విలువ సుమారు రూ.230.80కోట్ల వరకు ఉంటుందని అంచనా.