ఎర్రగడ్డ: కల్యాణలక్ష్మి పథకం కోసం ఏడాది కిందట దరఖాస్తు చేసుకున్నా..కల్యాణలక్ష్మి చెక్కులు నేటికీ చేతికి అందకపోవడంతో మహిళలు నిరసనకు దిగారు. బోరబండ డివిజన్ వీకర్‌సెక్షన్‌లోని బ్రాహ్మణవాడి బస్తీలో బుధవారం జరిగిన ఈ నిరసనకు సీపీఎం మద్దతు పలికింది. ఈ సందర్భంగా సీపీఎం జూబ్లీహిల్స్ సీనియర్ నేత సాయిశేషగిరిరావు మాట్లాడుతూ ఏడాది కిందట కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న బ్రాహ్మణవాడి బస్తీ మహిళలకు ఆర్నెళ్ల కిందటే చెక్కులు మంజూరైనట్లు సంబంధిత శాఖ నుంచి సమాచారం అందిందని పేర్కొన్నారు.
కానీ నేటి వరకు ఆ చెక్కులు లబ్ధిదారులకు అందకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని విమర్శించారు. తులం బంగారం ఇస్తామన్న హామీ అటుంచి.. గత ప్రభుత్వం హయాంలో దరఖాస్తు చేసుకున్న వారికి లక్ష రూపాయల చెక్కు ఇస్తే చాలని పేర్కొన్నారు. లబ్ధిదారులకు వెంటనే చెక్కులు అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసనలో మోహన్‌రాథోడ్, శివమ్మ, మీరా, గోపాల్, గమ్మిబాయి, సునీత, మోహన్‌నాయక్ పాల్గొన్నారు.