సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్/బాలానగర్ : ష్.. ఎక్కడి అధికారులు అక్కడే గప్‌చుప్.. కల్తీ కల్లు ఘటనపై ఎవరూ మాట్లాడవద్దు.. అని సర్కారు అంతర్గత ఆదేశాలు ఇవ్వడంతో ఆబ్కారీ శాఖలో కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు అంతా మీడియాతో దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని కొందరు అధికారులే ప్రత్యక్షంగా చెబుతుండగా మరికొందరు పరోక్షంగా మీడియాతో దూరంగా ఉంటున్నారు. ఏం అడిగినా తమకు తెలియదంటూ సున్నితంగా తప్పుకొంటున్నారు. ఇక కల్తీ కల్లు ఘటన జరిగిన బాలానగర్, రంగారెడ్డి జిల్లా ఆబ్కారీ అధికారులైతే మీటింగ్‌లు, బిజీ పేరుతో పెద్దల ఆదేశాలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగి 5రోజులు గడిచినా ఇప్పటి వరకు బాధితులు, మృతులకు సంబంధించి, అధికారులు ఎలాంటి స్పష్టమైన వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం.
కాగా, బాలానగర్ పరిధిలోని నాలుగు కల్లు దుకాణాల్లో సుమారు 500 మందికి పైగా కల్లు సేవించగా వారిలో సింహభాగం మంది అస్వస్థతకు గురై వేర్వేరు దవాఖానల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కానీ ఆబ్కారీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు కేవలం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న 38 మంది, ఇతర దవాఖానల్లో చికిత్స పొందుతున్న మరో నలుగురి వివరాలను మాత్రమే అధికారికంగా వెల్లడించడం విచారకరం. ఇక ఈ ఘటనలో చికిత్స పొందుతూ రోజుకు ఒకరు, ఇద్దరు చొప్పున పిట్టల్లా రాలిపోతున్నా.. ఇప్పటి వరకు అటు ప్రభుత్వం గాని, ఇటు ఆబ్కారీ అధికారులు గాని మృతుల వివరాలు తెలిపే సాహసం చేయడం లేదు.
కూకట్పల్లి కల్తీ కల్లు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు నిమ్స్‌లో 38 మంది, ఇతర దవాఖానల్లో నలుగురు చికిత్స పొందుతుండగా మరో 19 మంది బాధితులు గాంధీలో చికిత్స పొందుతున్నట్లు దవాఖాన వర్గాలు శుక్రవారం అధికారికంగా ప్రకటించాయి. వీరంతా వివిధ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతూ పరిస్థితి తీవ్రమవ్వడంతో రెండు రోజుల కిందట గాంధీకి తరలించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు మీడియా ఒత్తిడి మేరకు శుక్రవారం వెల్లడించారు. దీంతో అధికారిక గణాంకాల ప్రకారం బాధితుల సంఖ్య 61 మందికి చేరింది. వీరు కాకుండా కూకట్‌పల్లిలోని రామ్‌దేవ్‌రావు హాస్పిటల్లో సుమారు 20 మంది, ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్లో సుమారు 10 మంది, ఇతర ప్రైవేటు దవాఖానల్లో మరో 100 మంది మందికి పైగా చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే అధికారులు మాత్రం బాధితుల సంఖ్య, వివరాల విషయంలో గోప్యతను పాటిస్తున్నట్లు తెలుస్తోంది.
కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. అడ్డగుట్ట, ఇంద్రహిల్స్‌కు చెందిన చాకలి పెద్ద గంగారామ్(70) ఈనెల 7న బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని హెచ్ఎంటీ హిల్స్ కల్లు దుకాణంలో కల్తీ కల్లు సేవించి అస్వస్థతకు గురయ్యాడు.దీంతో బాధితుడిని చికిత్స కోసం గాంధీకి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కూకట్పల్లి పోలీసులు వెల్లడించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గడిచిన ఐదు రోజుల్లో కల్తీ కల్లు సేవించి 8 మంది మరణించినా.. ఇ ప్పటి వరకు కూడా ప్రభుత్వం మృతులను గు ర్తించడంగాని, వారి వివరాలను అధికారికం గా వెల్లడించడం గాని చేయకపోవడం గమనార్హం.
కల్తీ కల్లు ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడైన కాంగ్రెస్ నాయకుడు కూన సత్యం గౌడ్‌ను ఎట్టకేలకు ఆబ్కారీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బాలానగర్ స్టేషన్ పరిధిలో సత్యంగౌడ్ నిర్వహిస్తున్న కల్లు దుకాణాలలో కల్తీ జరిగినట్లు ఆబ్కారీ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పటికే నలుగురు నిర్వాహకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కల్తీ కల్లు ఘటనలో బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వేణుకుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆబ్కారీ కమిషనర్ హరికిరణ్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కల్తీ కల్లు విక్రయాలపై దృష్టి పెట్టడంలో విఫలమైన డీటీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తీరుపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. కల్లు దుకాణాలను తనిఖీ చేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బాలానగర్ ఇన్చార్జి ఎస్హెచ్ఓగా కుత్బుల్లాపూర్ సీఐ యాదయ్యకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.
నిమ్స్ దవాఖానలో చికిత్స పొందతున్న వారిలో తొమ్మిది మంది రోగులకు డయాలసిస్ కొనసాగుతున్నది. రోగుల అనారోగ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ యంత్రాంగం కల్లు దుకాణాల నిర్వాహకులపై నిఘా పెట్టాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరి కిరణ్ అదేశించారు. శుక్రవారం సాయంత్రం అబారీ భవన్ సమావేశ మందిరంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ కల్తీ కల్లు కంపౌండుల నిర్వాహణ, కల్లు వినియోగం, అమ్మకాల్లో జరుగుతున్న తప్పిదాలపై ఎప్పటికప్పుడు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలని అదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, రంగారెడ్డి, వరంగల్ , కరీంనగర్ , నల్లగొండ, నిజామాబాద్ డిప్యూటి కమిషనర్లు అనిల్ కుమార్ రెడ్డి, పి.దశరథ్ , ఏ.శ్రీనివాసరెడ్డి, వి.సోమిరెడ్డి, ఖమ్మం, మెదక్ అసిస్టెంట్ కమిషనర్లు గణేశ్, తదితరులు పాల్గొన్నారు.