గోల్నాక, ఏప్రిల్ 17: ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వచ్చేందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధులు కావాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు. అంబర్ పేట గులాబీ దండు బలమెంతో చూపుతూ ..దారులన్నీ ఎల్కతుర్తి వైపే సాగాలన్నారు. గురువారం అంబర్ పేట డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్ అధ్యక్షత చెన్నారెడ్డి నగర్ ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరిగింది.
స్థానిక కార్పొరేటర్ విజయ్‌కుమార్ గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరై మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, కాంగ్రెస్ పాలనను చూసి తాము మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు అందడం లేదని, తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా కావడం లేదన్నారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.