హైదరాబాద్ : గుండెపోటుతో కుప్పకూలిన ఓ వాహనదారుడి ప్రాణాలను కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు కాపాడారు. గురువారం మధ్యాహ్నం చాదర్‌ఘాట్ సిగ్నల్ వద్ద టూ వీలర్‌పై వెళ్తున్న ఓ యువకుడు ఆకస్మాత్తుగా కుప్పకూలాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఈ ఘటనను గమనించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గుండెపోటుతో కుప్పకూలిన యువకుడిని సీసీ షరఫ్ ఆస్పత్రికి తరలించారు.
సకాలంలో ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత బాధిత యువకుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. యువకుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.