హిమాయత్‌నగర్, ఆగస్టు 28: మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్‌ను అమలు చేసే ఆలోచనను ఎల్ అండ్ టీ సంస్థ ఉపసంహరించుకోవాలని యువజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గురువారం నాగోల్‌లో, ఈ నెల 30న మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు.
బుధవారం హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్లో యువజన సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు ఎన్.శ్రీకాంత్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేశ్, కార్యదర్శి వెంకటేశ్, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.ప్రదీప్ మాట్లాడుతూ పార్కింగ్ చార్జీలు వసూలు చేయడం వల్ల సామాన్య ప్రయాణికుల పై మరింత ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్ అండ్ టీ సంస్థ పార్కింగ్ చార్జీలు వసూ లు చేసే నిర్ణయాన్ని వెన్కకి తీసుకోవాలని, లేని పక్షంలో సెప్టెంబర్ 1న మెట్రో స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలు యువజన సంఘాల నేతలు మాజీద్ అలీఖాన్, కల్యా ణ్, అనిల్‌కుమార్,ఎం.రవి కుమార్, బీఎస్. కృష్ణ, మనోహర్,జావీద్,హష్మీ పాల్గొన్నారు.