మేడ్చల్ కలెక్టరేట్, జూలై 6: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు ఆయా కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా సంబంధిత శాఖల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు ఇతర కేసుల్లో సైతం బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా పోలీసులతో పాటు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని అన్నారు.
ఈ కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు చార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు నిర్ణీత సమయంలో కేసులను పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో కుల బహిష్కరణలు, సామాజిక బహిష్కరణలు విధించడంతో పాటు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితులకు ప్రభుత్వం తరుఫున అందించాల్సిన ఆర్థిక సహాయం సకాలంలో వచ్చేలా చూడాలని, కేసులలో నిందితులు తప్పించుకోకుండా వారికి తగిన శిక్ష పడేలా పూర్తి ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో సమర్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింహా రెడ్డి, డీసీపీ జానకి, జిల్లా రెవెన్యూ అధికారిణి(ఎఫ్ఏసీ) చంద్రవతి, జిల్లా అధికారులు వినోద్, బాలాజీ, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.