JBS Elevated Corridor | బొల్లారం, ఏప్రిల్ 5: ఎలివేటెడ్ కారిడార్ రాజీవ్ రహదారి రోడ్డు విస్తరణలో (జేబీఎస్ నుండి శామీర్పేట) వరకు చేపట్టే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా ఆస్తులు కోల్పోతున్న బీ3 బంగ్లా నిర్వాసితులకు రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని బీ3 బంగ్లా ల్యాండ్ ఓనర్స్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ముకుందా రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత మూడు నాలుగు తరాలుగా బీ3 బంగ్లాలో సుమారు 40 నుండి 50 కుటుంబాలు నివసిస్తున్నామని, తాము దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారం కావడంతో ఇంటి స్థలం కొనుగోలు చేసి నిర్మించుకునే పరిస్థితిలో లేమని తెలిపారు. బొల్లారంలో ఎకరం విస్తీర్ణంలో కంటోన్మెంట్ స్థలం ఉందని, రహదారి వెంబడి ఉన్న తమ భూములకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వని యెడల ఆ స్థలంలో ప్లాట్లు చేసి నిర్వాసితులకు కేటాయించాలని కోరారు. ఈ సమస్యపై ఇప్పటికే నిర్వాసితులు హైకోర్టులో అనేక రిట్ పిటిషన్లు దాఖలు చేశామని ఇప్పటివరకు రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు స్థలం కొనుగోలు చేసి నిర్మాణానికి పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విశాల్, శ్రీహరి, శ్రీకాంత్, ప్రమోద్, విశాల్ పాల్గొన్నారు.