సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో ఏదైన ప్రాజెక్టుకు టెండర్ పిలిస్తే చాలు…ఆ పనులను దక్కించుకునేందుకు పదుల సంఖ్యలు ఏజెన్సీలు పోటీ పడేవి.. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా తీసుకువచ్చిన ఎస్ఆర్డీపీ పనులకు చిన్న కాంట్రాక్టర్ల నుంచి బడా కాంట్రాక్టర్లు సైతం టెండర్ ప్రక్రియలో పాల్గొని పనులు దక్కించుకునేవారు..ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీ, ఆర్యూబీ పనుల్లో భాగంగా అప్పటి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రాజెక్టులను నిర్ణీత గడువు ముందే పూర్తి చేశారు..
కానీ ఘనత వహించిన కాంగ్రెస్ పాలనలో గడిచిన 22 నెలలుగా ఒక్క ప్రాజెక్టు ముందడుగు పడలేదు. ఎస్ఆర్డీపీని హెచ్ సిటీ ప్రాజెక్టుగా పేరు మార్చిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. అంతేకాదు గతేడాది డిసెంబర్ నెలలో కేబీఆర్ పార్కు చుట్టూ రూ. 1070కోట్ల పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా పనులు మొదలు కాకపోవడం సర్కారు పనితీరును నిదర్శనం.
ఈ నేపథ్యంలోనే హెచ్ సిటీ ప్రాజెక్టు కింద రూ. 7032 కోట్లతో 58 చోట్ల ఫ్లె ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, రహదారుల విస్తరణ పనులకు విడతల వారీగా టెండర్లు పిలుస్తున్నా..పనులు దక్కించుకునేందుకు ఏజెన్సీలు ముందుకు రావడం లేదు. జీహెచ్ఎంసీలో ఉద్యోగులకు జీతాల్లేక అవస్థలు పడుతుండడం, దాదాపు రూ. 6500కోట్ల మేర అప్పుల ఊబిలో కూరుకుపోవడం, ప్రాజెక్టు ఇంజినీరింగ్ విభాగం అస్తవ్యస్తంగా మారడం, ప్రాజెక్టు పనులపై ప్రణాళికలు లోపించడం, ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలు వెరసి కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ పనులపై ఆసక్తికనబర్చడం లేదు.
ఈ క్రమంలోనే హెచ్ సిటీ ప్రాజెక్టు కింద మొన్న ఆర్మీ ఆర్డినెన్స్ కార్న్స్ (ఏఓసీ) సెంటర్లో రహదారుల పనులకు ఏజెన్సీలు ముందుకు రాలేదు. దీంతో టెండర్ గడువును మరికొంత కాలం పెంచారు. తాజాగా రేతిబౌలి-నానల్‌నగర్‌లో వంతెనల నిర్మాణానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రూ.398 కోట్లతో ప్రతిపాదించిన వంతెన నిర్మాణం కోసం టెండర్ నోటిఫికేషన్ ప్రకటించగా..కేవలం ఒక సంస్థ మాత్రమే బిడ్ దాఖలు చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ ఇన్ఫ్రా కంపెనీ బిడ్ దాఖలుకు ముందకు వచ్చింది. దీంతో టెండర్ రీ కాల్ చేయాలని నిర్ణయించారు..మొత్తంగా హెచ్ సిటీ ప్రాజెక్టును సర్కారు ప్రశ్నార్థకంగా మార్చేసింది.
తరచూ టెండర్ రీ కాల్
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్ సిటీ) ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టును హెచ్ సిటీగా మార్చిన ప్రభుత్వం.. గడిచిన 22 నెలలుగా ఒక్క చోట కూడా పనులను ప్రారంభించలేకపోయింది. రూ. 7032 కోట్లతో 58 చోట్ల ఫ్లె ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, రహదారుల విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించగా… పనుల్లో ఒక్క అడుగు ముందుకు పడలేదు..దీనికి కారణం జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం అధికారుల నిర్లక్ష్యమే.
భూ సేకరణపై స్పష్టత లేకుండానే టెండర్లు పిలవడం…. న్యాయపరమైన చిక్కులు తలెత్తుతుండడంతో పనులు ముందుకు సాగని పరిస్థితి. ఇప్పటికే కేబీఆర్ పార్కు చుట్టూ రూ. 1070కోట్ల పనులకు సంబంధించి ఏజెన్సీకి ఖరారు చేసినా నెలల తరబడి పనులు ప్రారంభం కానీ పరిస్థితి. ఒక ప్రాజెక్టుపై ఎదురైన అనుభవం పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అధికారులు గుణపాఠం నెర్వడం లేదు.
ఇటీవల బంజారాహిల్స్ విరించి దవాఖాన నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వరకు 200 ఫీట్ల మేర రహదారి నిర్మాణానికి రూ. 150కోట్ల పనులకు భూ సేకరణపై స్పష్టత లేకుండా టెండర్లు పిలిచారు. వీవీఐపీ కారిడార్ కావడంతో భూ సేకరణ సులువు కాదని భూ సేకరణ విభాగం అధికారులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్ ఏఓసీ సెంటర్లో రహదారుల పనుల టెండర్‌కు ఏజెన్సీలు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే రేతిబౌలి-నానల్‌నగర్‌లో మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణం మరింత ఆలస్యం కానుంది.
ట్రాఫిక్ సమస్యను పెంచారు
హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…బడ్జెట్లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం…రూ. 7032 కోట్లతో హెచ్ సిటీ ప్రాజెక్టు ద్వారా 58 ప్రాజెక్టులు చేపడుతున్నాం …బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు..కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా ప్రాజెక్టు పనులు పట్టాలెక్కలేదు.
కాగా, అధికారుల నిర్లక్ష్యంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జఠిలమవుతున్నది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్లే వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావని సోషల్ మీడియా వేదికగా వాహనదారులు మండిపడుతున్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, కోఠి మార్గాల్లో ట్రాఫిక్ సుడిగుండం నుంచి బయట పడాలంటే నరకయాతన తప్పడం లేదని వాహనదారులు చెబుతున్నారు.