Hyderabad | మన్సురాబాద్ : డ్రంకెన్ డ్రైవ్‌లో ముచ్చటగా మూడోసారి పట్టుబడిన ఓ వ్యక్తికి న్యాయమూర్తి రెండు రోజుల జైలు శిక్షను విధించారు. ఈ ఘటన ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఎల్బీనగర్ ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు ఈనెల 11న సాయంత్రం ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగోల్‌కు చెందిన ఎస్ చంద్రన్న(33) బైకుపై అటువైపునకు రాగా పోలీసులు అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో అతడు మద్యం సేవించినట్టు నిర్ధారణ అయింది. చంద్రన్న పూర్తి వివరాలను పరిశీలించగా మద్యం తాగి వాహనం నడుపుతూ మూడోసారి పట్టుబడ్డట్లు తేలింది. చంద్రన్నను ఈనెల 12న రంగారెడ్డి కోర్టులోని 6వ స్పెషల్ ఎంఎం కోర్టులో హాజరపరిచారు. మద్యం సేవించి మూడోసారి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డ చంద్రన్నకు జడ్జి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎల్బీనగర్ ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జనవరి నెల నుంచి ఫిబ్రవరి 12 వరకు ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం సేవించి 604 మంది పట్టుబడినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరపరచగా 13 మందికి ట్రాఫిక్ డ్యూటీ, ఇద్దరికీ రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి రూ. 8,02,500 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవద్దన్నారు. మద్యం తాగి ప్రమాదాలకు గురైన వారు తమ కుటుంబాలకు శిక్ష వేసిన వారు అవుతారని పేర్కొన్నారు.