Hyderabad | బంజారాహిల్స్, జూలై 13 : పురుగులు పట్టిన చాక్లెట్లను విక్రయించిన సంస్థ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్‌లో నివాసం ఉంటున్న డా.పేరూర్ పురేందర్‌రెడ్డి శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని అఫ్‌జాన్ ఇంటర్నేషనల్ రిటైల్స్ సంస్థకు చెందిన ఆఫ్జాన్ డేట్స్ అండ్ నట్స్ షాపుకు వెళ్లారు. అక్కడ కొన్ని ఆల్మండ్స్, కాజూ, డేట్స్‌తో పాటు డేట్స్‌తో తయారు చేసిన చాక్లెట్లను కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత చాక్లెట్స్ బాక్సు తెరిచి చూడగా వాటిలో తెల్లటి రంగులోని పురుగులు కనిపించాయి. దీంతో అష్జాన్ డేట్స్ అండ్ నట్స్ షాపుకు వెళ్లిన పురేందర్‌రెడ్డి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అయితే సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ మేరకు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అఫ్‌జాన్ ఇంటర్నేషనల్ రిటైల్ లిమిటెడ్ సంస్థ మీద బీఎన్ఎస్ 125, 274, 275 సెక్షన్లతో పాటు 59 ఫుడ్ సేఫ్టీ స్టాండర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.