సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది. ఈ జాబితాను నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు జాబితాలో మార్పులు, చేర్పులు చేపట్టేందుకు వీలుగా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించగా, ఈ నెల 30న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.
ముసాయిదా ప్రకారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుష ఓటర్లు 2,04,288 మంది కాగా, మహిళా ఓటర్లు 1,88,356 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు.
17 వరకు అభ్యంతరాల స్వీకరణ
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన డ్రాఫ్ట్ ఫొటో ఓటర్ల జాబితా కాపీని సంబంధిత ఈఆర్వో కార్యాలయంలో, పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉంచారు. ఓటర్లు తమ పేర్లను ధృవీకరించుకోవడానికి వీలుగా సీఈఓ వెబ్సైట్ www.ceotelangana.nic.inలో కూడా అప్లోడ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈసీఐ వెబ్సైట్ https://voters.eci. gov.in లేదా సీఈఓ వెబ్ సైట్ www.ceo telangana.nic.inలో అందుబాటులో ఉన్న ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. ఫారం-6, ఫారం-7, ఫారం-8లో సమర్పించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితాపై సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు చెప్పారు.
నూతన ఓటర్లకు అవకాశం..
.2025 జులై ఒకటో తేదీ నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో సైతం ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ముసాయిదా ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, మార్పులు, చేర్పులు, మృతుల పేర్ల తొలగింపు, పోలింగ్ కేంద్రాలు, నియోజకవర్గాల మార్పు చేసుకోవాలనుకునే వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈనెల 25 వరకు ఫిర్యాదులు, అర్జీలను పరిష్కరించి, సెప్టెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.
ముసాయిదా వివరాలు
లొకేషన్లు :139
పోలింగ్ స్టేషన్లు :407
పురుష ఓటర్లు :2,04,288
మహిళా ఓటర్లు :1,88,356
ఇతరులు :25
మొత్తం ఓటర్లు :3,92,669