జూబ్లీహిల్స్, అక్టోబర్ 9 : బంజారాహిల్స్‌లోని షేక్‌పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటుచేసిన రిటర్నింగ్ కార్యాలయంలో ఈనెల 13 నుంచి ఉప ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తామని జూబ్లీహిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్, సికింద్రాబాద్ ఆర్డీఓ పి. సాయిరామ్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తదుపరి ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థుల నుంచి ఆయా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.
గురువారం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఆయా ప్రతినిధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, 19 వ సర్కిల్ డీసీ జీ.రజినీకాంత్ రెడ్డి, ఏఆర్ఓ.. 19 వ సర్కిల్ ఏసీపీ ప్రసీద, షేక్‌పేట్ తహసీల్దార్ అనితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.