సిటీబ్యూరో/బంజారాహిల్స్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయం.. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్బులో గ్రూపు వార్ ఆ ప్రాంతంలో రణరంగాన్ని తలపించింది. ఇది సహజంగా జరిగేదే అని పోలీసులు అంటున్నప్పటికీ అక్కడ ఉన్నది మాత్రం ఓ పెద్ద మనిషి కొడుకు. సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ యాదవ్ ఈ గొడవలో కీలకమైన వ్యక్తి కావడంతో విషయం పెద్దదైంది. అయితే అధికార పార్టీ ఎంపీ సోదరుడు కావడంతో అక్కడ గొడవ పడిన రెండు వర్గాలపై కేసు పెట్టడానికి పోలీసులు మల్లగుల్లాలు పడిన పరిస్థితి. చివరకు సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్ ఆరో అంతస్తులో కారా కారా పేరుతో పబ్ నడుస్తోంది.
శనివారం అర్ధరాత్రి తర్వాత పబ్‌లో పార్టీలో మునిగితేలుతున్న ఎంపీ సోదరుడు అరవింద్‌కుమార్ యాదవ్ అతడి అనుచరులకు మరో గ్యాంగ్‌తో గొడవ ప్రారంభమైంది. గోడకు ఆనుకుని నిలబడిన అరవింద్‌కుమార్‌ను దాటుకుంటూ.. ముందుకెళ్లేందుకు ఓ యువకుడు ప్రయత్నించిన సందర్భంలో అరవింద్ ఆయనను తీవ్ర పదజాలంతో దూషించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగి అది కాస్తా రెండు గ్యాంగులు కొట్టుకునే వరకు వెళ్లింది. సుమారుగా అరగంట పాటు ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకోగా, పబ్‌లో ఉన్నవారంతా చెల్లాచెదురయ్యారు.
అసలేం జరుగుతుందో తెలియక వారంతా ఆందోళనగా బయటకు పరుగులు తీశారు. అయితే గొడవపడుతున్న రెండు గ్యాంగులను పబ్ లోపల నుంచి సెల్లార్లోకి బౌన్సర్లు తీసుకొచ్చారు. రెండు గ్యాంగుల సభ్యులు పెద్ద ఎత్తున సెల్లార్ వద్దకు చేరుకోవడంతో మరోసారి పరస్పర దాడులకు దిగడంతో అక్కడంతా యుద్ధవాతావరణం నెలకొంది. ఈ గొడవలో కొన్ని కార్లను ధ్వంసం చేసుకోగా, ఇరు వర్గాలకు చెందిన కొందరికి గాయాలైనట్లు తెలిసింది. ఈ గొడవపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకోగా, గొడవకు దిగిన రెండు గ్యాంగుల సభ్యులు కనిపించలేదని పోలీసులు చెప్పారు.
ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు గొడవకు గల కారణాలు, ఆ ప్రాంతంలో పరిస్థితులను ఆరా తీశారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి అత్యంత సమీపంలో ఉన్న దస్పల్లా హోటల్లో ఈ స్థాయిలో గొడవ జరుగుతున్నా.. గంట సేపటి వరకు పోలీసులు రాకపోవడం పట్ల నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు చెప్పినప్పటికీ చివరి వరకు అరవింద్‌కుమార్ యాదవ్ పాత్రపై అధికార పార్టీ ముఖ్యనేతల సూచనలు పాటించినట్లు తెలిసింది. ఆ తర్వాత సోషల్ మీడియాతో పాటు మీడియాలో ఈ ఘటన సంచలనం కావడంతో కేసు నమోదు చేశారు.
పోలీసుల మల్లగుల్లాలు..!
జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్ ఘటనలో అధికార పార్టీకి చెందిన ఎంపీ సోదరుడి పాత్ర ఉండడంతో కేసు నమోదు విషయంలో సుమారు పన్నెండు గంటల హైడ్రామా నడిచింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదంటూ.. పోలీసులు చెప్పడం విచిత్రంగా కనిపించింది. ఘటనాస్థలానికి చేరుకుని క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలించినప్పటికీ ఫిర్యాదు రాలేదంటూ.. కాలయాపన చేయడం వెనక అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లు ఉన్నట్లు జూబ్లీ డివిజన్ పోలీసుల్లో చర్చ జరిగింది. సీఎం నివాసముండే ప్రాంతంలో గట్టి నిఘాతో పాటు పోలీసు బందోబస్తు అధికంగా ఉన్నప్పటికీ దస్పల్లా వంటి హోటళ్లలో జరిగే పార్టీలు, వ్యవహారాలు తమకు తెలిసినా.. నోరు మెదపలేని పరిస్థితి అనీ, ఈ ఘటనలోనూ అరవింద్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని తాము అనుకున్నా..పోలీసు ఉన్నతాధికారులతో పాటు అధికార పార్టీ పెద్ద నేతల నుంచి కేసు వద్దని ఫిర్యాదు లేకుండా ఎందుకు చర్యలంటూ.. ఒత్తిళ్లున్నాయని జోన్‌కు చెందిన ఓ అధికారి చెప్పారు.
అయితే సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి అరవింద్ ఉన్నాడంటూ.. వైరల్ అవ్వడంతో చర్యలు తీసుకుంటూ.. ఎస్ఐ సందీప్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొడవకు దిగిన ఇరు వర్గాలపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. పబ్ నిర్వాహకులకు సమయపాలన పాటించకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్‌ను నడుపుతున్న దస్పల్లా కారాకారా యాజమాన్యంపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ పరిశీలించి ఇరవై మంది ఈ గొడవలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వారెవరు అనే విషయంపై ఆరా తీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
పోలీసుల్లో ఆందోళన..!
ఇటీవల మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలోనూ పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో ప్రముఖుల పేర్లు బయటకు రాకుండా పోలీసు ఉన్నతాధికారులు మేనేజ్ చేయడం, ఇరవై రోజుల పాటు జరిగిన పరిణామాలు, కేసుల నమోదు వ్యవహారం అటూఇటూ తిరిగి ఆ ఠాణాలో పనిచేసిన ఇన్స్పెక్టర్ ముత్తూయాదవ్ మెడకు చుట్టడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. తాజా ఘటనలో మరోసారి అధికార పార్టీ నేత కుటుంబసభ్యుడి పాత్ర ఉండడంతో ఏం చేయాలనే అంశంపై డివిజన్ పోలీసుల్లో చర్చ జరిగింది. తాము ఏం చర్యలు తీసుకుంటే ఏమవుతుందో.. ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందోనంటూ జూబ్లీ పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటన వివరాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుండడంతో కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి. కానీ అధికార పార్టీ ముఖ్య నేతల ఒత్తిళ్ల మధ్య తమపై అధికారులు ఏం చేయాలో సూచించకుండా కేసు పెట్టడంపై తేల్చుకోలేకపోతున్నారు. దస్పల్లా పబ్ ఘటన కారణంగా ఈసారి ఏ పోలీసు అధికారిపై ఎలాంటి చర్యలు ఉంటాయోనంటూ పోలీసులు గుబులు చెందుతున్నారు. సరైన రీతిలో డ్యూటీలు చేద్దామనుకున్నా..ఆ పరిస్థితి లేదని, ఎప్పుడూ లేనంతగా ఒత్తిళ్లు ఉన్నాయని, ప్రత్యేకించి జూబ్లీహిల్స్ జోన్లోనే ఈ పంచాయితీ పెద్దగా ఉందంటూ.. ఓ సీనియర్ పోలీసు అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.