హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ రాజీనామా చేయాలంటూ నాటకాలు మొదలుపెట్టిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. సరైన సమయం వచ్చినప్పుడు హిరణ్యకశిపుడి భరతం పట్టేందుకు నరసింహస్వామి వచ్చినట్టే కేసీఆర్ కూడా ప్రజల కోసం వస్తారని స్పష్టంచేశారు.
తమ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేకే బూతులు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి, కేసీఆర్ వస్తే ఎదురుగా నిలబడగలడా అని నిలదీశారు. పేద ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు నిద్రలోనూ కేసీఆర్ జపమే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
క్యాబినెట్లో అంతర్గత కలహాలు తీవ్రరూపం దాల్చాయని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఎకడ తమ కుర్చీలకు ఎసరు వస్తుందోనన్న భయంతోనే మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ వంటి వారు సీఎం మెప్పు పొందేందుకు ధర్నాల్లో పాల్గొంటున్నారని ఎద్దేవా చేశారు. నకిరేకల్‌లో జరిగిన పార్టీ సభకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకాకపోవడమే గ్రూపు తగాదాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘అన్న ఔట్.. తమ్ముడు ఇన్’ అన్న చందంగా పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు.ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయి ఇప్పటికే కేసీఆర్ సంక్షేమ పాలనను గుర్తు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.