సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ కొనసాగుతున్నది. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ ఉప ఎన్నికపై చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతతో జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పక్కాగా గెలుస్తుందనే చాల మంది భరోసాలో ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ గెలుపుపై ఎక్కువ మంది బెట్టింగ్ పెట్టేందుకు ముందుకొస్తున్నారని రెండు రాష్ర్టాలలో చర్చ జరుగుతున్నది.
బీఆర్ఎస్ గెలిస్తే రూ. 10 లక్షలకు రూ. 20 లక్షలు, కాంగ్రెస్‌కు రూ. 5 లక్షలకు డబుల్ అంటూ ఫంటర్లు ఆఫర్లు ఇస్తున్నారని పలు కూడళ్లలో మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ఉప ఎన్నికలో అధికార పార్టీకే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది, కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తుండడడంతో ఓటమి తప్పదనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే భరోసా ఎవరికీ లేకపోవడంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా వెనుకాముందు ఆలోచిస్తున్నారనే టాక్ నడుస్తున్నది. దీంతోనే ఫంటర్లు తక్కువ మొత్తంలో బెట్టింగ్ మొత్తాన్ని ఫిక్స్ చేశారని మాట్లాడుకుంటున్నారు.
అంతర్గత సర్వేలతో…!
కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఉండటం, ఎక్కడ చూసినా ప్రజల్లో కాంగ్రెస్ ఓడిపోతుందనే టాక్ వస్తుండటం, అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేయడం, కాంగ్రెస్ పార్టీకి పాలనపై పట్టులేకపోవడం, ఎటు చూసినా అవినీతి అక్రమాలు, అభివృద్ధి, సంక్షేమం కుంటుపడటంతో రెండేండ్లలోనే భారీగా వ్యతిరేకతను ఆ పార్టీ మూట కట్టుకుందని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ కుటుంబంపై రౌడీముద్ర ఉండడం, నవీన్ గెలిస్తే స్థానిక వ్యాపారులు, ప్రజలు రౌడీయిజంతో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందనే భయాందోళనలు ఉండటంతో అధికారి పార్టీ అభ్యర్థి అయినా ఓటమి తప్పదని ఇంటెలిజెన్స్ సర్వేలు, ప్రైవేట్ సర్వేలతో ప్రభుత్వానికి నివేదికలు అందాయనే వార్తలు చక్కర్లు కొట్టాయి.
వీటన్నింటితో పాటు బీఆర్ఎస్ గత పదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్ ప్రతి ఒక్కరికీ సుపరిచితుడై ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడం, ఆయన మరణాంతరం ఆయన భార్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరపున పోటీలో ఉండటంతో సానుభూతి కలిసి వస్తున్నది. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాడని, అయినా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత అలాగే ఉందనే వాదన జూబ్లీహిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ రాయుళ్లు అధికార పార్టీపై కాకుండా ప్రతిపక్ష పార్టీపై ఎక్కువ మొగ్గు చూపుతున్నారని పలువురు మాట్లాడుకుంటున్నారు.
అందరి చూపు జూబ్లీహిల్స్ వైపే…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇటూ బీఆర్ఎస్కు, అటూ కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. వాస్తవ పరిస్థితులన్నీ బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెబుతున్నాయి. అయితే సీఎం రేవంత్‌రెడ్డికి ఇది వ్యక్తిగతంగా ఇక్కడ గెలువడం అనివార్యంగా మారుతున్నది. ఇందుకు వందల కోట్ల రూపాయలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఆ పార్టీ నాయకులు ఖర్చు చేస్తున్నారని చర్చ జరుగుతున్నది. అధికార బలాన్ని ఉపయోగించి దొంగ ఓట్లు, రిగ్గింగ్ చేయడానికి కూడా వెనుకాడకుండా అధికారాన్ని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం కాంగ్రెస్ పక్కాగా ఓడిపోతుందనే మాట్లాడుకుంటున్నారు.
కాంగ్రెస్‌పై ప్రతి ఒక్కరిలో వ్యతిరేకత ఉండడంతో ఓటర్లు తమ వ్యతిరేకతను ఈ ఉప ఎన్నికలో చూపిస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు వచ్చిన అవకాశాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఉపయోగించుకుంటారని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. రాష్ట్ర ప్రజల నమ్మకానికి ఎక్కడా భంగం కలుగకుండా జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించడం ఖాయమనే అందరూ ఎదురు చూస్తున్నారు. దీనితో బెట్టింగ్ రాయుళ్లు మాత్రం పక్కాగా బీఆర్ఎస్ గెలుస్తున్నదనే ధీమాతో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయనే టాక్ నడుస్తున్నది.