సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : చింత చచ్చిన పులుపు చావదన్నట్లుగా ఒకప్పటి ట్విన్ సిటీస్ రౌడీషీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం బాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రౌడీ వేషాలు తగ్గి ఏళ్లు గడుస్తున్నా.. గుట్టుగా భూ కబ్జాలతో కోట్ల రూపాయల భూములకు ఎసరు పెడుతున్న తీరు ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ వాసులను విస్మయానికి గురిచేస్తోంది. పాలకుడిగా ప్రజా సేవ చేస్తామంటూ ఆ కుటుంబం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా జనాలు ఆ కుటుంబం చేసిన కబ్జాలు, ఆక్రమణలు, బెదిరింపులు, భూబాగోతాలను తలుచుకుని భయాభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజా సేవ దేవుడెరుగూ? నియోజకవర్గంలో ఉండే ఖాళీ జాగాలకు రక్షణ అయినా ఉంటుందా? అని ప్రశ్నించుకుంటున్నారు. పొరపాటున ఆయన గెలిస్తే స్థానిక సమస్యల ముసుగులో ఎన్ని సెంటిల్మెంట్లను చూడాల్సి వస్తుందోనని సగటు సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు. నియోజకవర్గంలో అభివృద్ధే తన విషయాన్ని గుర్తు చేశారు.
ధ్యేయమని, స్థానికంగా ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసంటూ బరిలో దిగిన శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ కుటుంబానికి స్థానికంగా చెప్పుకోదగిన పేరేమి లేదు. ఇప్పటికీ ట్విన్ సిటీస్ తరహాలో జరిగే బెదిరింపులు, సెటిల్మెంట్లు షరా మామూలే అనిపించినా.. జనాలు మాత్రం భరించలేకపోతున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి పరిష్కరిస్తామని, ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటూ చెప్పుకోవడం చూసి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఆయన కుటుంబసభ్యుల మేక వన్నె పులి బాగోతాలు, అరాచకాలు, మోసాలను తలచుకుని భయపడిపోతుంటే, కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేసిన తీరు ఇప్పుడు విస్మయానికి గురిచేస్తోంది.
తన ఇంటికి సమీపంలోనే అత్యంత రద్దీ కలిగిన రోడ్డుపై ప్రమాదకరమైన మూలమలుపువద్ద విస్తరణ పనులు జరగకుండా ఖరీదైన స్థలాన్ని కబ్జాచేసినట్లు తేలింది. నిత్యం లక్షలాది మంది వాహనదారులు ఈ మలుపు వద్ద ఇరుక్కొని ఇబ్బందులు పడుతుంటే.. అత్తగారి సొమ్మును అల్లుడి దానం అన్నట్లుగా కబ్జాకు పెట్టడంపై స్థానికులే నివ్వెరపోతున్నారు. లక్షమంది జనాభా కలిగిన రహ్మత్‌నగర్,బోరబండ, మోతీనగర్,అల్లాపూర్ ప్రాంతాలకు చెందిన వాహనదారులు అ ప్రాంతానికి చేరుకోగానే ట్రాఫిక్‌లో నరకం చవిచూస్తున్నారు. గతంలోనే రోడ్డు విస్తరణకు ప్రయత్నించినా నవీన్ యాదవ్ కుటుంబసభ్యుల భూదాహం కారణంగా, వారు సృష్టించిన లిటిగేషన్ల కారణంగా రోడ్డు విస్తరణకు నాలుగేళ్లుగా బ్రేక్ పడింది. కార్మిక నగర్- యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ రోడ్డుపై నిమ్జ్మే వద్ద ఖరీదైన 357 గజాల ప్రభుత్వ స్థలాన్ని బోగస్ పత్రాలతో ఆక్రమించి అధీనంలో పెట్టుకున్నారని తేలింది.
ఖైరతాబాద్ మండల పరిధిలోని యూసుఫ్‌గూడ గ్రామ పరిధిలోకి వచ్చే సర్వే నెంబర్ 149/2లో రహ్మత్‌నగర్ నుంచి యూసుఫ్‌గూడ జానకమ్మ తోట వైపునకు వెళ్లేదారిలో సుమారు 357 గజాల ప్రభుత్వ స్థలం ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉంది. గురుద్వారా కమాన్‌కు సమీపంలో ఉన్న ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.4కోట్లకు పైగా ఉంటుంది. యూఎల్సీ ల్యాండ్‌గా రెవెన్యూ రికార్డుల్లో ఉండటంతో పాటు ల్యాండ్ బ్యాంక్‌లో పెట్టిన ఈ స్థలంపై కన్నేసిన కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ యాదవ్ బోగస్ పత్రాలను సృష్టించారు. సోమూరి స్వర్ణలత అలియాస్ నాదెళ్ల స్వర్ణలత అనే మహిళ తనకు జీపీఏ చేసిందంటూ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. సదరు స్థలంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులను పెట్టి గుడిసెలు చుట్టూ ప్రహరీ నిర్మించడంతో పాటు బోగస్ పత్రాలతో కరెంట్ బిల్లులు, ఆస్తిపన్ను పత్రాలను సైతం చేయించుకున్నాడు.
వాటి సాయంతో ఈ స్థలాన్ని జీవో 92కింద తనకు క్రమబద్ధీకరించాలని 2017లో అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే యూఎల్సీ కింద ఉన్న ఈ స్థలాన్ని క్రమబద్ధీకరణ చేయడం కుదరదని రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. ప్రభుత్వ స్థలంలో వెలిసిన ఆక్రమణలను ఖైరతాబాద్ మండల రెవెన్యూ అధికారులు 2021లో తొలగించడంతో కోర్టును ఆశ్రయించగా స్టే మంజూరైంది. యథాతద స్థితి కొనసాగించాలని తీర్పు వచ్చినా ఈ స్థలంలో నిర్మాణాలు చేసేందుకు పలురకాలుగా నవీన్ యాదవ్ ప్రయత్నాలు ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైనా ఈ స్థలాన్ని కాజేయాలనే కుట్రతో పలు ప్రయత్నాలు చేశారు. అయితే స్థానికుల వ్యతిరేకతతో పాటు న్యాయపరమైన వివాదాలు వస్తుండడంతో స్థలంలో నిర్మాణాలు మొదలుపెట్టలేకపోయారు.
గడిచిన కొన్నేళ్లుగా ఈ ప్రాంతం గుండా వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏనాడు తాము ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని రోడ్డు వెడల్పు కోసం ఇస్తామని విడిచిపెడతామని చెప్పలేదు. నిత్యం ఇరుకైనా రోడ్డుతో లక్షలాది మంది వాహనదారులు ఎదుర్కొనే సమస్యలను పట్టించుకోలేదు కానీ.. తాను గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కరిస్తానంటూ చెప్పుకు తిరగడం జనాలు నమ్మలేకపోతున్నారు. ఒకప్పుడు దివంగత నేత మాగంటి పాలనలో ప్రజా సమస్యలకు పరిష్కరం దొరికేదని, ఇప్పుడు సమస్యలకు కారణమైన వ్యక్తులే ప్రజల్లోకి వస్తున్నారంటూ నియోజకవర్గ ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.