సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్.. అసలు కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి తన సొంత టీంతో ప్రచారం నిర్వహిస్తుండటం, ప్రచార సమయంలో తమకు ఎదురవుతున్న అవమానాలపై ఆపార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఇలాంటి అభ్యర్థిని తాము చూడలేదని.. ‘పార్టీని గౌరవించడం..
నాయకులు, కార్యకర్తలంటే కనీస మర్యాద కూడా లేకుండా.. పార్టీ నాయకులు.. కార్యకర్తలతో నాకేం పని.. నాకంటూ ఓ స్ట్రాటజీ ఉంది.. నా కంటూ సొంత బలం… సొంత టీమ్స్ ఉన్నాయి’ అంటూ అసలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అభ్యర్థి వర్గం పక్కన పెట్టేస్తోందంటూ ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీ నుంచి బీ ఫామ్ చేతికి రావడం.. నామినేషన్ల ప్రక్రియ.. స్క్రూటీని కూడా పూర్తికావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వ్యవహారశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులను చూసి ఖంగుతినడం ఆ పార్టీ నేతల వంతైంది. ఏకంగా మంత్రుల స్థాయి నాయకుల మాటలకే విలువ లేకుండా పోతోందంటూ పలువురు కీలక నేతలు మాట్లాడుకుంటున్నారు.
పార్టీలో చేరే నేతలపై చిన్నచూపు!
పార్టీలో చేరేందుకు కొందరు చోట మోట లీడర్లు ముందుకు వస్తున్నారని, వాళ్లను పార్టీలో చేర్చుకోవాలంటూ ఏకంగా పార్టీ అధిష్టానం సూచనలు చేసినా కాంగ్రెస్ అభ్యర్థి వర్గం భేఖాతర్ చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పార్టీలో చేరేందుకు వచ్చేవారిని ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న కొందరు మంత్రులే స్వయంగా హైదరాబాద్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పుతున్నారని నాయకులు చెబుతున్నారు. పార్టీ కోసం పనిచేస్తామని వచ్చే వాళ్లను చిన్నచూపు చూస్తున్న సదరు జూబ్లీహిల్స్ అభ్యర్థి.. ఎలా గెలుస్తాడో తాము కూడా చూస్తామంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. తన సొంత వర్గంతో ప్రచారంలో మునిగి తేలుతున్న కాంగ్రెస్ అభ్యర్థికి ఓటమి తప్పని పరిస్థితి నెలకొందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాకుండా, ఎంఐఎం పార్టీ అభ్యర్థిగానే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి వ్యవహరిస్తున్నాడని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
పార్టీలో కుత.. కుత !
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేష్టలతో ఆ పార్టీలోని అసలైన కాంగ్రెస్ నాయకులు కుతకుత ఉడికిపోతున్నట్లు సమాచారం. పార్టీ పరువును నిలబెట్టుకోవడానికి తాము ప్రయత్నిస్తామంటే.. మీ సేవలు మాకు అవసరం లేదు అన్నట్లుగా అభ్యర్థి తీరు ఉందంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని తన సొంత వర్గంతో తిరుగుతూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని నేతలు మండిపడతున్నారు. కేవలం ఎంఐఎం పార్టీ తరపున వచ్చే ఓట్లు నాకు సరిపోతాయని మైనార్టీ ఓట్లన్నీ తనకేననే భ్రమలో ఉన్నాడని, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందంటూ స్వయంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుకుంటున్నారు.
మైనార్టీలు అంత అమాయకులు ఏమీ కారని, రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీపై అన్ని వర్గాలలో తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయాని స్వయంగా ఆపార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అన్ని వర్గాల వారు కాంగ్రెస్ పార్టీపై కోపంతో ఉన్నారని, అందులో మైనార్టీలు కూడా ఉన్నారనే విషయాన్ని తమ పార్టీ అభ్యర్థి మర్చిపోయి, భ్రమలలో తేలుతున్నాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. సొంతపార్టీ నేతలకే ప్రచారంలో మర్యాద ఇవ్వడం లేదని, ఇలా ఐతే ఐక్యంగా ముందుకు ఎలా వెళ్తామని మండిపడుతున్నారు. సీనియర్లను గౌరవించడం లేదన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫారం తీసుకొని, చిత్తుగా ఓడి పార్టీ పరువును సదురు అభ్యర్థి మరింత దిగజార్చే అవకాశాలున్నాయంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేయడం జుబ్లీహిల్స్‌లో కన్పించింది.