సిటీబ్యూరో, నవంబర్ 14(నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో సాగిన కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యవేక్షించారు. అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, జోనల్ కమిషనర్లు అపూర్వ్ చౌహాన్, హేమంత్ సహదేవ్రావులు కౌంటింగ్ సజావుగా జరిగేలా సమన్వయం చేశారు. ఉదయం 8గంటలకు లెక్కింపు మొదలు కాగా 10 రౌండ్లలో మధ్యాహ్నం 2గంటలకు ముగిసింది.
నియోజకవర్గంలోని ఏడు డివిజన్లకు గానూ బీఆర్ఎస్ పార్టీకి 74,234 ఓట్లు వచ్చాయి. ఇందులో షేక్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ డివిజన్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు పోటీనిచ్చింది. షేక్‌పేటలో బీఆర్ఎస్కు 13,078 ఓట్లు(42శాతం), ఎర్రగడ్డలో 11,939 ఓట్లు(40శాతం), బోరబండలో 12,247 ఓట్లు(41శాతం)తో కాంగ్రెస్‌ను గట్టిగా ఎదుర్కొన్నది. కాగా ఈ మూడు డివిజన్లలో ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ పక్షానే అత్యధికంగా నిలిచారు.
