హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మరణంతో ఆ స్థానానికి ఉపఎన్నిక (Jubilee Hills By-Election) జరుగుతున్నది. నోటిఫికేషన్ వెలువడక ముందే తమ అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాథ్‌ను (Maganti Sunitha) ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ.. ప్రచారంలో దూసుకుపోతున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు తోపాటు ఎమ్మెల్యేలు, ప్రధాన నాయకత్వం అంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక, ఉప ఎన్నిక నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియనుంది. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా నామినేషన్లు వేస్తుండటంతో పోటాపోటీ నెలకొంది.
అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో ఇప్పటివరకు 127మంది నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు చిన్న పార్టీల ప్రతినిధులు, స్వతంత్రులు ఎక్కువగా ఉన్నారు. మంగళవారంతో నామినేషన్లకు గడువు ముగియనుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మరోసెట్ నామినేషన్ పత్రాలు సమర్పించడానికి సిద్ధమయ్యారు. బుధవారం నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు సమయం ఉన్నది. నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది. అదే నెల 14న ఫలితాలు వెలువడుతాయి.