సిటీబ్యూరో/ముషీరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని, జర్నలిస్టులకు నష్టం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను సవరించాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్ కలెక్టరేట్ ముందు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులు నిరసనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన జర్నలిస్టులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ పోలీసుస్టేషన్‌కు చేరుకొని వారితో కలిసి నిరసన తెలిపారు. ఈ నిరసనలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
