హైదరాబాద్ సిటీబ్యూరో, జులై 10 ( నమస్తే తెలంగాణ ) : ఓయూలో నిరుద్యోగుల ఆందోళనను కవరేజీ చేస్తున్న జర్నలిస్టు చరణ్‌ను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. తెలంగాణలో మరోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోలాగా పోలీసు రాజ్యం వచ్చిందా? అనేలా పోలీసుల వ్యవహార శైలి ఉందని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయ ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని, ఆ పోలీసులపై ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులపై పోలీసులు దాడులకు పాల్పడితే సహించేదిలేదని టీయూడబ్ల్యూజే నాయకులు మారుతీసాగర్, టీఈఎంజేయూ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. దాడులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి బీ బసవపున్నయ్య డిమాండ్‌చేశారు. దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆన్లైన్ జర్నలిస్టుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుషోత్తం చాట్లపల్లి కోరారు. జీ తెలుగు న్యూస్ రిపోర్టర్‌పై పోలీసుల దాడిని ఖండించి సంఘీభావం తెలిపిన జర్నలిస్టులకు, సంఘాలకు జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ ఎస్ భరత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.