Job Fair | అమీర్పేట : ఎర్రగడ్డ సెయింట్ థెరిస్సా చర్చ్ ఆవరణలో రంగారెడ్డి జిల్లా ఎన్సీఎస్, సనత్నగర్ బాస్కో సేవా కేంద్రం, దిశ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైంది. ఈ సందర్భంగా 188 మంది అభ్యర్థులు వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జాబ్ మేళాలో పలు సాఫ్ట్వేర్, వైద్యం, విద్య, హార్డ్వేర్ సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా 188 మంది అభ్యర్థుల్లో 90 మందిని ఎంపిక చేసి.. 55 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. ఇందులో 25 మందికి ఆయా కంపెనీలు ఆఫర్ లెటర్స్ అందించాయి.
ఆఫర్ లెటర్లు అందుకున్న అభ్యర్థులకు పూర్తిస్థాయి ఇంటర్వ్యూలో ఆయా కంపెనీల్లో మరోసారి ఇంటర్వ్యూలు జరుగుతాయని జాబ్ మేళా కోఆర్డినేటర్ ఐవన్ వాస్ పేర్కొన్నారు. సనత్నగర్ సెయింట్ థెరిస్సా చర్చి ఆవరణలోని దిశ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు పదుల సంఖ్యలో జాబ్ మేళాలు ఏర్పాటు చేయడం నిర్వహించారు. దిశ డైరెక్టర్గా ఫాదర్ జస్టిన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జాబ్ మేళాలతో పాటు కెరీర్ గైడెన్స్ అంశాల్లో యువతీ యువకులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమాలకు సంస్థ పెద్దపీట వేసిందని తెలిపారు. త్వరలోనే మరిన్ని జాబ్ మేళాతో పాటు కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు వాస్ తెలిపారు.