కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 12 : పరీక్షా ఫీజులు తీసుకోకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రిన్సన్ కాలేజీపై చర్యలు తీసుకోవాలని జేఎన్టీయూహెచ్ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ పోరం నాయకుడు జివ్వాజి దిలీప్ అన్నారు. బుధవారం జేఎన్టీయూహెచ్ వర్సిటీలో ప్రిన్సన్ కాలేజీ తీరును నిరసిస్తూ..మోకాళ్లపై కూర్చోని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రిన్సన్ కళాశాలలో సీఆర్టీ ఫీజు కట్టలేదని పరీక్షా ఫీజులు తీసుకోవటం లేదని ఆరోపించారు. కళాశాల యాజమాన్యం విద్యార్థులను బెదిరింపులకు పాల్పడి ఒక్కొక్క విద్యార్థి దగ్గర వేలాది రూపాయలు వసూలు చేయడం బాధకరమన్నారు.
సీఆర్టి ఫీజులు కట్టని విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలు రాయడానికి అనుమతులు లేవంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ట్యూషన్ ఫీజుల బకాయిల పేరుతో విద్యార్థులను చదువుకు దూరం చేయొద్దని చెపుతున్నా..యాజమాన్యాలు పట్టించుకోకుండా సీఆర్టీ ఫీజుల పేరుతో విద్యార్థులను గురిచేస్తున్నాయన్నారు. కళాశాలలో వేధింపులపై రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రిన్సన్ కళాశాల తీరుపై జేఎన్టీయూహెచ్ ఉన్నతాధికారులు విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో విద్యార్థులతో కలసి కళాశాలను మట్టుడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు దుర్గాప్రసాద్, శ్రీను, చందు, హేమంత్, రంజిత్, రాజ్‌కుమార్, గౌతమ్, ఆనంద్, ధనుంజయ, స్టాలి, ఆనంద్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.