ATM Centers | సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రెండు రాష్ర్టాల సరిహద్దులోని గ్రామస్తులు జేసీబీల మెకానిక్‌లుగా ఆరితేరారు. దేశంలోని వివిధ నగరాలలో మెకానిక్‌లుగా పనిచేస్తూ అక్కడి పరిసరాలను గమనిస్తుంటారు. ఇలా ఆయా గ్రామాలలోని వారంతా అన్నదమ్ములు, బంధువులే ఎక్కువగా ఉంటారు. కట్టర్లతో ఈజీగా ఏటీఎంలను ధ్వంసం చేయడంలో ఆరితేరారు.
అయితే ఏటీఎం కేంద్రాలను దొంగలు టార్గెట్‌గా చేస్తుండడంతో చాల బ్యాంకులు ఆధునీక పరిజానంతో కూడిన ఏటీఎం యంత్రాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. జేసీబీ మెకానిక్‌లుగా ఆరితేరిన రాజస్తాన్, హర్యాన రాష్ర్టాలకు చెందిన దొంగలు ఓల్డ్మోడల్లో ఉండే ఏటీఎంలను లక్ష్యంగా చేసుకొని దేశ వ్యాప్తంగా కొల్లగొడుతున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. రాచకొండ పోలీసులు ఇటీవల ఆదిభట్ల, మైలార్‌దేవ్‌పల్లి ఏటీఎం చోరీ ఘటనలను ఛేదించి రాజస్తాన్, హర్యానాలకు చెందిన ఐదుగురు ముఠాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
మార్చి2న తెల్లవారుజామున్న ఆదిభట్లలో చోటుచేసుకున్న ఏటీఎం చోరీ ఘటనను ఛేదించేందుకు రాచకొండ పోలీసులు నిరంతరం హైదరాబాద్ టూ రాజస్తాన్, హర్యానలకు వెళ్లిన గ్యాంగ్‌లు, పాత నేరస్థుల చిట్టాను సేకరించి ఇదంతా రాజస్తాన్‌లోని ‘సందీక’ ముఠాగా గుర్తించి కేసును ఛేదించిన విషయం తెలిసిందే. దొంగతనాలు, దోపిడీలు, సైబర్‌నేరాలకు అడ్డాలుగా ఉన్న రాజస్తాన్, హర్యానలలోని కొన్ని ప్రాంతాలలోని వారే కరుడుగట్టిన నేరస్తులుగా దేశంలో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడం కోసం రాజస్తాన్‌లో 10 రోజుల పాటు ఆదిభట్ల పోలీసులు దొంగల కోసం గాలించి స్థానిక పోలీసుల సహకారంతో దర్యాప్తును ముందుకు సాగించారు.
రాజస్తాన్‌లోని సందీక, హర్యానలోని బందోలి తదితర గ్రామాలు రెండు రాష్ర్టాల సరిహద్దులలో ఉంటాయి. ఆయా గ్రామాలలోవారి బంధుత్వం ఉంటుంది, దీంతో రెండు రాష్ర్టాలలోను వారి రాకపోకలు సాగుతుంటాయి. ఒక చోట దొంగతనం చేసి తమ స్వస్థలానికి చేరుకుంటారు. దొంగతనం జరిగిన ప్రాంతం నుంచి పోలీసులు దొంగలను గుర్తించి ఆ ప్రాంతానికి చేరుకున్నారంటే వెంటనే పక్కనే ఉన్న సరిహద్దు రాష్ర్టాంలోకి తమ మకాంను మార్చేసి దర్యాప్తు కోసం వెళ్లిన పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిస్తుంటారు.
ఇలా ఈ రెండు గ్రామాలలో ఉండే వారితో ఏటీఎంలను దొంగిలించే గ్యాంగ్‌లు చాల ఉన్నాయి. ఇందులో కొందరు జైల్లో ఉంటే మరికొందరు బయట ఉంటారు. ఆదిభట్లలో దొంగతనం చేసిన గ్యాంగ్‌లో ప్రధాన సూత్రదారి రాహుల్ ఖాన్ ఇక్కడకు వచ్చి 10 రోజుల పాటు రెక్కీ నిర్వహించి అనంతరం తన గ్యాంగ్‌ను విమానంలో హైదరాబాద్‌కు రప్పించుకున్నాడు. అలాగే మరికొందరు మరో టీమ్‌తో కలిసి మరో ప్రాంతానికి వెళ్తారు. ఇలా ఆయా గ్రామాలలో ఎవరు అందుబాటులో ఉంటే వారిని తీసుకొని ఆ గ్యాంగ్ లీడర్ వెళ్లిపోతాడని పోలీసుల విచారణలో తేలింది. గ్యాస్కట్టర్లను ఉపయోగించడంలో ఇక్కడున్న వారు ఆరితేరి ఉంటారని పోలీసులు గుర్తించారు.
రాహుల్ ఖాన్ గ్యాంగ్ పోలీసులకు దొరకకుండా ముందస్తుగానే ప్లాన్ చేసుకుంటారు. పోలీసుల దర్యాప్తు ఎలా ఉంటుందనే విషయంపై అవగాహన ఉండడంతో వారికి దొరకకుండా ఎత్తులు వే స్తున్నారు. ఇందులో భాగంగానే ఆదిభట్ల చోరీ ఘటనకు పాల్పడే ముందు రాహుల్ ఖాన్ తన కారుకు స్టిక్కర్లు వేయడం, దొంగతనం చేసి చోట కుంటుకుంటూ నడువడం, మరో దగ్గర ముఖానికి మాస్క్వేసుకొని ఇలా ఫీట్లు చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. దొంగతనం చేయడానికి ముందు కారు ఒక రకంగా కన్పిస్తోంది, అలాగే దొంగల నడవడిక అలాగే ఉంటుంది. దొంగతనం చేసి బయటకు వచ్చిన తరువాత కారు రంగులను మార్చి తాము కూడా తమ నడకతీరు,ైస్టెల్‌ను మార్చేస్తుంటారు. సీసీ కెమెరాలు గుర్తించినా తమను గుర్తుపట్టకుండా ఉండేలా రాహుల్‌ఖాన్ గ్యాంగ్ జాగ్రత్తలు తీసుకుంటుందని పోలీసులు పేర్కొన్నారు.