వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 20: వ్యవసాయ యూనివర్సిటీ వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాట్లు భారీగా జరిగినప్పటికీ, ఈ ఉత్సవాలకు ప్రధాన ఆయువు పట్టు అయిన రైతులు లేక ఉత్సవం, ఏర్పాటు చేసిన స్టాల్స్ వెలవెలబోయాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ వజ్రోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలు ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి.
అనంతరం, క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు మాత్రం ఆశించిన స్థాయిలో రైతులు రాలేదు. శాస్త్రవేత్తలు, అధికారులు, విద్యార్థులతో కళకళలాడింది. ఎక్కువ మంది రైతులు వస్తారేమో కొంత సమాచారం, సలహాలు చెబుదామని వీసీ జానయ్య ఆహ్వానం మేరకు వచ్చిన రిటైర్డ్ వీసీలు, శాస్త్రవేత్తలు రైతులు లేకపోవడంతో కిమ్మనకుండాఉండిపోయారు.
మహిళా రైతులను వేళ్లపై లెక్కించొచ్చు. ‘నమస్తే’ పలువురి రైతులను పలుకరించగా, ఏడాదిగా సీఎం రేవంత్ రెడ్డి ఉట్టి మాటలే నరుకుతున్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు ఎక్కడా స్పష్టత లేని హామీలిస్తున్నారు. పాలమూరులో అనేక హామీలిచ్చారు. దేనికీ పొంతన లేదు. సభకు ఆయనొస్తారో లేదో? ఏమి మాట్లాడతారో.. ఆయనకే గుర్తుండదు! అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు వ్యవసాయ, అనుబంధం, రంగాల వారు 50 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటిని తిలకించే నాథుడే లేడు. ఇదంతా పాలకుల పరిపాటే గానీ, వర్సిటీ అధికారులు భోజనాలు, మెటీరియల్, వ్యవసాయ సమాచారం ఏర్పాట్లన్నీ బాగానే చేశారన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యతనిచ్చి, దేశంలోనే అగ్రభాగాన మన అభివృద్ధిని నిలబెడతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలను పురస్కరించుకుని క్రీడల ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన రైతులనుద్దేశించి మాట్లాడారు. వరి, ఇతర పంటలో విప్లవాత్మక మార్పులు సంభవించాయని, అందులో భాగంగానే వరి ధాన్యం అధికంగా పండించి దేశంలోనే మొదటి వరసలో నిలిచామన్నారు.
కార్యక్రమాన్నిప్రారంభించిన గవర్నర్ డాక్టర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ వరితో పాటు అన్ని రకాల పంటలను ప్రోత్సహించాలని, ప్రధానంగా మిల్లెట్స్, నూనె గింజల పంటలను ప్రోత్సహించాలన్నారు. ఇప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి మన రాష్ర్టానికి 25 టన్నుల నూనెలను దిగుమతి చేసుకుంటున్నామని గుర్తు చేశారు.