చదువు, ఆస్తిపాస్తులు, మంచి ఉద్యోగం, అందచందాలు ఉన్నా వయస్సు మీద పడుతుంది కానీ పెండ్లిళ్లు కావడం లేదు. మంచి ఉద్యోగం ఉండి 30 ఏండ్లు దాటుతున్నా యువకులకు వివాహాలు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రయోజకులైన తమ పిల్లలకు అమ్మాయిలను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు మానసికంగా కుంగిపోతున్నారు. పెండ్లిళ్లయి ఇక్కడ నివసిస్తున్న మహిళలు సంతాన సమస్యలతో సతమతమవుతున్నారు. ఏండ్లు గడుస్తున్నా అమ్మతనానికి నోచుకోకుండా మనోవేదనకు గురవుతున్నారు. దీనికితోడు ఇతర ప్రాంతాల నుంచి చుట్టాలు, స్నేహితులు ఆయా గ్రామాలకు రావడానికి జంకుతున్నారు. ఇదీ జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పరిసర గ్రామాల ప్రజల దుర్భర పరిస్థితి. డంపింగ్ యార్డు పరిసరాల్లోని దాదాపు 20 గ్రామాల్లోనూ ఇదే దుస్థితి నెలకొన్నది.

సిటీ బ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): చదువు, ఆస్తిపాస్తులు, మంచి ఉద్యోగం, అందచందాలున్నా వయస్సు మీద పడుతుంది కానీ పెండ్లిళ్లు కావడం లేదు. మంచి ఉద్యోగం ఉండి 30ఏండ్లు దాటుతున్నా యువకులు వివాహాలు కాకుండా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయోజకులైన తమ పిల్లలకు అమ్మాయిలను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు మానసికంగా కుంగిపోతున్నారు. పెండ్లిలైన మహిళలూ పిల్లలు పుట్టక సంతాన సమస్యలతో సతమతమవుతున్నారు. ఏండ్లు గడుస్తు న్నా అమ్మతనానికి నోచుకోకుండా మనోవేదనకు గురవుతున్నారు. పెళ్లీడుకొచ్చిన యువతులు నెలసరి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు.
ఇదంతా ఒక సమస్య అయితే.. ఆ గ్రామాలకు ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా రావడానికే జంకుతున్నారు. సమీప బంధువులు సైతం వారి ఇండ్లకు రావడానికి ముఖం చాటేస్తున్నారు. అత్తగారింటి నుంచి ఆడబిడ్డలు సైతం ఆయా గ్రామాలకు రావడానికి అయిష్టత కనబరుస్తున్నారు. ఇదం తా.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పరిసర గ్రామాల ప్రజల దుర్బరమైన పరిస్థితి. డంపింగ్ యార్డు పరిసరాల్లోని దాదాపు 20 గ్రామాల్లోనూ ఇదే దుస్థితి నెలకొన్నది. ఎక్కడి నుంచో తీసుకొచ్చిన చెత్త కుప్పలు ఇక్కడి ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. వారికి సంబంధం లేకున్నా.. చెత్త కుప్పలు తీసుకొస్తున్న కాలుష్య భూతం బా రిన పడుతున్నారు. ప్రశాంతమైన జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి.అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వాళ్లదాకా డంపింగ్ కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు.
ప్రమేయం లేకున్నా కాలుష్య కోరల్లోకి..
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ప్రభావిత గ్రామాలు తమ ప్రమేయం లేకున్నా కాలుష్య కోరల్లో చిక్కుకుని సర్వస్వం కోల్పోతున్నారు. మహిళలు అమ్మతనాన్ని కోల్పోతున్నారు. పసిగుడ్డులు తల్లి గర్భంలోనే కన్నుమూస్తున్నారు. యువకులు పెండ్లికాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు. చిన్నారులు చర్మ, శ్వాసకోశ వ్యాధుల బారినపడి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. నిత్యం వందలాదిగా వస్తున్న లారీల మోత వల్ల గాలిలో తేలియాడుతున్న చెత్తతో అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా కాలుష్యపు దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూమి, నీరు, గాలి కలుషితమై విషపు వలయంలో చిక్కుకుంటున్నారు. గాలి పీల్చలేరు.. నీళ్లు తాగలేరు.. భూమిపై బతకలేని పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. డంపింగ్ యార్డు పరిసరాల్లోని 20 గ్రామాలు అనధికారికంగా వెలివేతకు గురవుతున్నాయి. సుమారు ఐదు లక్షల మంది సహాయ నిరాకరణకు లోనవుతున్నారు. ప్రభుత్వం, అధికారులు కరుణించి తమ జీవితాలను బాగు చేయాలని వేడుకుంటున్నారు.

కొడుకు పెండ్లి కోసం ఊరిని వదిలేశాం..
మాది జవహర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని కార్మికనగర్. డంపింగ్ యార్డులోని చెత్త గట్టల నుంచి వచ్చే దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గాఢమైన దుర్వాసన వల్ల మా ఇంటికి చుట్టాలు కూడా రావడం మానేశారు. నా కుమారుడు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తున్నా పెండ్లి కాకపోవడంతో మానసికంగా ఇబ్బందులు పడ్డాం. అన్నివిధాలుగా మంచిగున్నా ఈ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో ఆడపిల్లను ఇచ్చి పెండ్లి చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయలేని పరిస్థితిలో మెట్టుగూడలో అద్దె ఇంటికి మారాం. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంతో పెండ్లి సంబంధాలు వచ్చాయి. ఇప్పుడు నా కుమారుడికి పెండ్లి అయ్యింది. జవహర్‌నగర్ పరిసరాల్లోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. మా ఊర్లకు రావడానికే ఇతర ప్రాంతాల వారు వెనకాడుతున్నారు. ప్రభుత్వం స్పందించి చెత్తను ఇక్కడికి తరలించకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలి.
– విఠల్, కార్మికనగర్,
ఆడబిడ్డలు అమ్మతనం కోల్పోతున్నారు
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పరసర ప్రాంతాల్లోని ఆడబిడ్డలు అమ్మతనాన్ని కోల్పోతున్నారు. పెండ్లిలై ఐదేండ్లు దాటుతున్నా పిల్లలు పుట్టడం లేదు. గాలి, నీరు కలుషితవమవడంతో కాలుష్యం వల్ల సంతాన సమస్యలు వస్తున్నాయి. దవాఖానలకు వెళ్తే డంపింగ్ యార్డు చెత్త నుంచి వచ్చిన కాలుష్య కారకాలే సంతాన సమస్యలకు కారణమని చెబుతున్నారు. ఎక్కడి నుంచో చెత్త కుప్పలు తెచ్చి మా బిడ్డలకు అమ్మతనాన్ని కోల్పోయేందుకు కారణమవుతున్నాయి. సంతాన సమస్యలతో పాటు మహిళలు ఇతర అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మా సమస్యలను గుర్తించి ఇక్కడికి చెత్తను తరలించకుండా చూడాలని వేడుకుంటున్నాం. మేం ఇంత ఇబ్బందులు పడుతుంటే అధికారులు, నాయకులు చూస్తూ ఊరుకోవడం తీవ్రంగా కలచి వేస్తున్నది. ఇప్పటికైనా మా ఇబ్బందులు గుర్తించి చెత్త కంపు నుంచి విముక్తి కలిగించాలి. – అనూరాధ, అహ్మద్‌గూడ