జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు మూడు కార్పొరేషన్ల పరిధిలో మూడు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలన్నారు. డంపింగ్‌యార్డుతో ప్రజలు పడుతున్న నరకయాతన, ఆవేదన, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. అన్ని పార్టీల నేతలు సమస్యలపై అధికారులను నిలదీశారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యలకు సీఎం శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ అంశంపై లేవనెత్తగా, దాదాపుగా ఎమ్మెల్యేలు, ఎంపీ, ప్రధాన ప్రతిపక్షంతో పాటు అధికార పక్షం నేతలు కూడా డంపింగ్ యార్డు అంశంలో తమ ఆగ్రహాన్ని వెల్లగక్కారు. రాంకీ సంస్థ డంపింగ్ యార్డులో తీసుకోవాల్సిన ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టడం లేదని, పరిసర ప్రాంతాల వారికీ ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శలు గుప్పించారు. కార్పొరేషన్ పరిధిలోని పలు సమస్యలను ప్రస్తావించిన ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రధానంగా చెత్త డంపింగ్ యార్డుపైనే తమ అభిప్రాయాలను వెలబుచ్చారు.
-సిటీబ్యూరో/ఎల్బీనగర్/మల్కాజిగిరి, మే 21 (నమస్తే తెలంగాణ)
మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ, విడివిడిగా మూడు డంపింగ్‌యార్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదు. రేవంత్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై కేసులు వేశారు. అక్కడికి చెత్త లారీలు రావొద్దని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. అయినా రోజు వందల లారీలు ఎలా వస్తున్నాయి. డంపింగ్‌యార్డుతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు కలుషితం కావడంతో తాగునీటి సమస్య వస్తుంది. జవహర్‌నగర్‌ను దత్తత తీసుకున్న రాంకీ సంస్థ ఒప్పంద నిబంధనలు పాటించడం లేదు. విషవాయువులు వెదజల్లుతూ రెండున్నర సంవత్సరాలుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డు సమస్యల నుంచి పరిష్కారం లభించాల్సిందే. ఉచితంగా నీరు, టాక్స్ ఫ్రీ అవకాశం ఇక్కడి ప్రజలకు ఇవ్వాలి.
ఎల్బీనగర్లోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో జరిగిన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్‌హాల్ సమావేశంలో కార్పొరేషన్ పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎంఎంసీ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి, ప్రభుత్వ చిఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటుగా మాజీ మంత్రులు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వజ్రేశ్‌యాదవ్, పరమేశ్వర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి, రంగా నర్సింహా గుప్త, పవన్‌కుమార్, కళ్లెం నవజీవన్‌రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, బద్దం ప్రేం మహేశ్వర్‌రెడ్డితో పాటుగా పలువురు నాయకులు, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతోతో పాటుగా వివిధ విభాగాల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఆసియాలోనే అతిపెద్ద డంపింగ్ యార్డుగా, ప్రపంచంతో పెద్ద డంపింగ్‌యార్డుగా మారిందని, దీని విషయంలో సమగ్రంగా వ్యవహరించకుంటే పరిస్థితి దయనీయంగా మారుతుందని వారంతా పేర్కొన్నారు.
మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని పలు సమస్యలను ఎమ్మెల్యేలు ఏకరువు పెట్టారు. చెరువులు, వరదనీటి కాలువలు, పూడిక తీత పనులు, టౌన్‌ప్లానింగ్ సమస్యలు మొదలుకుని పలు సమస్యలను టౌన్‌హాల్ సమావేశంలో ప్రస్తావించారు. రాబోయే వర్షాకాలం అయినందున చెరువుల పూడిక తీత మొదలు, గుర్రపుడెక్క తొలగింపు, చెరువుల సుందరీకరణ కార్యక్రమాలను వారు ప్రస్తావించారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అసలు పనిచేయడం లేదని, అవినీతి కంపుతో టౌన్‌ప్లానింగ్ విభాగం ఉందంటూ వారు కమిషనర్ ముందు వాపోయారు. ఈ విభాగాన్ని పక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. పారిశుధ్య సమస్యలను కూడా పకడ్బందీగా చేపట్టాలన్నారు.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు వీక్షణకు రాంకీ సంస్థ వారు తీసుకుని వెళ్లాలని, అక్కడ వారు తీసుకుంటున్న చర్యలను చూపించాలంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన డిమాండ్‌కు రాంకీ సంస్థ వారు తమ ఎండీ ప్రస్తుతం అందుబాటులో లేనందున తర్వాత పర్యాటన పెడదామంటూ పేర్కొనగా అందుకు అడ్డు తగిలిన మల్లారెడ్డి..వెంటనే డంపింగ్ యార్డు వీక్షణ జరగాలని, అందరూ వస్తే అక్కడి ప్రజల దీన స్థితి తెలుస్తుందంటూ డిమాండ్ చేశారు. దీంతో ఎంపీ ఈటల రాజేందర్ జోక్యం చేసుకుని శుక్రవారం ఉదయం 9 గంటలకు జవహర్‌నగర్ డంపింగ్ యార్డును వీక్షిద్దామంటూ పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులు కూడా ఒకే చేయడంతో శుక్రవారం ఉదయం పరిశీలించనున్నారు. ఈ సమావేశంలో ఎంఎంసీ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో, ఎంఎంసీ హెల్త్, శానిటేషన్ అదనపు కమిషనర్ రఘుప్రసాద్, రాంకీ సంస్థ ప్రతినిధి తోట కృష్ణ, మాజీ కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుతో అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో డంపింగ్‌యార్డు తొలగించేవరకు పోరాటం చేయాలి. చెరువుల్లో చేపలు కూడా బతకడంలేదు. సైనిక్‌పురి వరకు వాసన వస్తున్నది. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ప్రజలు ఎలా బతకాలి. టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి బాగా పెరిగిపోయింది. ప్రజల ఇబ్బందులు గుర్తించాలి. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలి. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా చూడాలి.
ట్రై కార్పొరేషన్ల పరిధిలో ప్రతిరోజు 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త జవహార్‌నగర్ డంపింగ్‌యార్డుకు చేరుతుంది. ఈ తీవ్రతను తగ్గించేందుకు సంగారెడ్డి జిల్లా పారానగర్లో కొత్తగా మరో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేయబోతున్నాం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్య తీవ్రంగా ఉంది. డంపింగ్‌యార్డుతో ఇబ్బంది పడుతున్న జవహర్‌నగర్ ప్రజలకు ఆస్తిపన్ను వసూల్లు చేయరాదు. మంచినీరు ఉచితంగా సరఫరా చేయాలి. వాటర్ బిల్లు వసూలు చేయరాదు. వర్షాకాలం నాటికి నాలాలు, డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించి నీరు సాఫీగా సాగేలా చూడాలి. సరూర్‌నగర్ చెరువుతో పాటుగా ఎల్బీనగర్లో చెరువుల్లోకి డ్రైనేజీ నీరు రాకుండా చూడాలి. సరూర్‌నగర్ సీఎం రోడ్డును వెడల్పు చేసి జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారం తగ్గించాలి. టీకేఆర్ కమాన్ ప్రాంతంలో ప్రస్తుతం ఫ్లై ఓవర్ నిర్మాణం అవసరం లేదు. దాని స్థానంలో సాగర్ రింగ్‌రోడ్డులో బీఎన్‌రెడ్డినగర్, హస్తినాపురం ఫ్లై ఓవర్ నిర్మించాలి. నాగోలు ఆనంద్‌నగర్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేయాలి. ఎల్బీనగర్ ప్రాంతంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల కాటుతో పలువురు ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారు. సైదాబాద్ సింగరేణి కాలనీ ద్వారా వచ్చి డ్రైనేజీని సరూర్‌నగర్ చెరువులో కలువకుండా చూడాలి. సైదాబాద్ పై ప్రాంతాల నుంచి వచ్చే పైప్‌లైన్ పెద్దదిగా వేసి గడ్డిఅన్నారంలోని చిన్నపైప్లైన్ ద్వారా వరదనీరు వెళ్లేలా కలుపడంతో వర్షాకాలంలో వరద ముంపు ఉంది. దీనిని అధికారులు వెంటనే పరిష్కారం చేయాలి. టౌన్‌ప్లానింగ్ విభాగం అవినీతిమయంగా మారిపోయింది. వారు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. వద్దనుకుంటే పలు రూల్స్ చూపించి అడ్డుకుంటారు. కొందరు లైసెన్స్ ప్లానర్లతోనే వారి వ్యవహారం కొనసాగుతున్నది. దీనిని సరైన మార్గంలో పెట్టాలి.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు నగరం నుండి నిత్యం 10 నుంచి 12 వేల టన్నుల చెత్తను తరలిస్తున్నారు. రాంకీ సంస్థ ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తూ దుర్వాసన వెదజల్లుతోంది. డంపింగ్‌యార్డు ప్రాంతంలోని ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందడం లేదు. డంపింగ్ యార్డు నిర్వహణలో రాంకీ సంస్థ ఘోరంగా విఫలం చెందింది. శుక్రవారం ప్రజాప్రతినిధులతో కలిసి డంపింగ్ యార్డును సందర్శిస్తాం. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుతో దూర ప్రాంతాలకు దుర్వాసన వస్తున్నది. దీనిని శుద్ధి చేయకపోతే భావి తరాలకు మనం నష్టం చేసిన వారమవుతాం. ఒకే డంపింగ్ యార్డుతో సమస్యలు ఎక్కువ అవుతున్నందున మూడు కార్పొరేషన్ల పరిధిలో మూడు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
వర్షాలు వస్తే మల్కాజిగిరి మునిగే ప్రమాదం ఉంది. నాలాల్లో పూడికలు సరిగా చేయడంలేదు. మచ్చబొల్లారంలోని హిందూ శ్మశానవాటికలో ఏర్పాటు చేసిన డంపింగ్‌యార్డును వెంటనే తొలగించాలి. స్వచ్ఛ మిషన్ కింద రాంకీ సంస్థ ప్లాస్టిక్ వ్యాపారం నిర్వహిస్తున్న అంశంపై విచారణ చేపట్టాలి. పారిశుధ్య నిర్వహణకు జేసీబీ, బాబ్‌కట్ వాహనాలు లేకపోవడం, కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. చెరువులలో గుర్రపుడెక్క తొలగింపు పనులు వేగవంతం చేయాలి. సర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలి. విద్య, వైద్యం, వ్యాపార రంగాల అభివృద్ధి కోసం బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. ఎస్‌హెచ్‌జీ లింకేజ్ వ్యవహరంలో అవకతవకలను అరికట్టాలి. బలరాంనగర్ ఎస్టీపీ వద్ద సిల్ట్ తొలగింపు పనులు, నీటి శుధ్ధీ సమస్యలు పరిష్కరించాలి. ఏకలవ్యనగర్ యూపీహెచ్సీ నిర్మాణంలో సమన్వయ లోపం నివారించాలి. చెత్త దహనం లేకుండా చూడాలి. మచ్చబొల్లారంలో ట్రంక్‌లైన్ సమస్యలు పరిష్కరించాలి. బండచెరువు నుంచి తార్నాక వరకు నాలా పనులు చేపట్టాలి.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై భారం పడకుండా మూడు కార్పొరేషన్ల పరిధిలోని మూడు ప్రాంతాల్లో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వర్షాకాలం నేపథ్యంలో వరదనీటి కాలువల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు వస్తాయి. నాలాలను శుద్ధి చేయాలి. శివారు ప్రాంతాల్లో దొంగల బెదడ తీవ్రంగా ఉంది. పోలీసులు దీనిపై దృష్టి పెట్టాలి. డబుల్ బెడ్రూం ఇండ్ల వరకు ఆర్టీసీ బస్సులను నడపాలి. చెరువులను అభివృద్ధి చేయడంతో పాటుగా చెరువుల్లోకి డ్రైనేజీ నీరు రాకుండా చూడాలి.
మల్కా.ఇగిరి కార్పొరేషన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి. ఎమ్మెల్యేలు, ఎంపి, ప్రజాప్రతినిధులు చెప్పిన అన్ని సమస్యలపై దృష్టి సారించండి. కమిషనర్‌తో పాటుగా అందరూ అధికారులు తమ దృష్టికి వచ్చిన సమస్యలు అన్ని నోట్ చేసుకున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టాం.. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కూడా సమావేశం నిర్వహిస్తాం. కమిషనర్ అన్ని సమస్యలు పరిష్కరిస్తారు.
దేశంలోనే అతిపెద్ద డంపింగ్‌యార్డు జవహర్‌నగర్‌లో ఉండటం దురదృష్టకరం. దీనితో ప్రజలు తీవ్రమైన వ్యాధులకు గురవుతున్నారు. రాంకీ సంస్థకు లాభం చేకూరుతున్నది. లక్షాలాది మంది ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతున్నది. ఉచిత నీరు ఇస్తామని చెప్పి ఇవ్వడంలేదు. ఎంఎంసీ పరిధిలో మేడ్చల్ నియోజకవర్గం నుంచే అత్యధిక ఆదాయం వస్తుంది. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుతో పరిసర ప్రాంతాలలో కిలోమీటర్ల మేర దుర్వాసన వస్తున్నది.