సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో రెండో రోజూ పూడికతీత పనులు నిలిచిపోయాయి. బిల్లులు ఇచ్చేదాకా పూడిక (సీవరేజీ) ఎత్తివేసేది లేదంటూ గురువారం నుంచి సీవర్ క్లీనింగ్ మెషిన్స్ ఓనర్స్ అసోసియేషన్ నిరసనకు దిగారు. విధుల్లోకి వెళ్లకుండా దాదాపు 200 వాహనాలను నిలిపి వేసి పూడికతీత పనులకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో కొన్ని చోట్ల రహదారులపై మురుగు పొంగిపొర్లింది. రోజూ 1500 చోట్ల పూడికతీత పనులు చేపట్టే వీరంతా రెండు రోజులుగా విధుల్లో చేరకపోవడంలో సీవరేజీ ఓవర్‌ఫ్లో సంఖ్య పెరిగింది. పొంగిపొర్లే మురుగునీటితో దుర్వాసన, మరో వైపు దోమల బెడదతో ప్రజలు అనారోగ్యబారిన పడే అవకాశాలు ఉన్నాయి. అధికారులు మాత్రం బిల్లుల చెల్లింపులో అభ్యంతరాలు నెలకొన్నాయని..
ఒక్కో వాహనానికి నెలకు రూ.2లక్షలు చెల్లించే విషయంలో దాదాపు 40వేల వరకు డబుల్ పేమెంట్స్ జరుగుతూ ఆడిట్ అభ్యంతరాలు వస్తున్నాయంటున్నారు. సీవర్ క్లీనింగ్ మెషిన్స్ ఓనర్స్ అసోసియేషన్‌కు చెప్పినా వారు వినడం లేదని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా బిల్లులు చెల్లించే వరకు పూడిక ఎత్తివేయమని, విధుల్లోకి చేరమని సీవర్ క్లీనింగ్ మెషిన్స్ ఓనర్స్ అసోసియేషన్ చెబుతుండడం.. ఈ నిరసన ఇలాగే కొనసాగితే మున్ముందు మరింత ఇబ్బందులు తప్పవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే జోక్యం చేసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.