Jalamandali | సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : రెవెన్యూపై నిర్దేశించిన లక్ష్యాలను ఈ నెలాఖరులోపు చేరుకోవాలని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో రెవెన్యూపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించి.. డివిజన్ల పరంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత లక్ష్యాలను ఈ నెలాఖరులోపు చేరుకోవాలని, ముఖ్యంగా మొండి బకాయిలు, కమర్షియల్ వినియోగదారుల బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ బిల్లులపై ఎండీ ఆరా తీశారు. బిల్లులు చెల్లించని వారికి.. బిల్లులు కట్టేలా సందేశాలు పంపించాలన్నారు. బకాయిదారులు స్పందించని పక్షంలో మరోసారి హెచ్చరిక సందేశం పంపాలన్నారు. అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. నల్లా కనెక్షన్లు తొలగించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో డైరెక్టర్లు వీఎల్ ప్రవీణ్‌కుమార్, అజ్మీరా కృష్ణ, స్వామి తదితరులు పాల్గొన్నారు.