అంబర్‌పేట, నవంబర్ 23 : కాంగ్రెస్, బీజేపీ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగానే జీవో నెంబర్ 46ను ఆగమేఘాలపై ప్రభుత్వం తీసుకువచ్చిందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అధికశాతం రెడ్లను సర్పంచులుగా చేయడం కోసమే అగ్రకుల నాయకులు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 46ను నిరసిస్తూ ఆ జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తా జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జీవో కాపీలను చించివేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 46తో బీసీలకు కేవలం 18 శాతం రీజర్వేషన్లు వర్తిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను రాజకీయ సమాధి చేయడం కోసం రాత్రికి రాత్రి జీవోను తెచ్చారన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతుందని ప్రశ్నించారు. జీవో నెంబర్ 9 రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినప్పుడు బీసీ సమాజం సంతోషం వ్యక్తం చేసిందని, 46 తో తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
45 జీవోను రద్దు చేసేవరకు ప్రభుత్వం పై బీసీల పోరాటం ఆగదన్నారు. అసెంబ్లీలో బిల్లులు పెట్టి చట్టం చేసే సందర్భంలో మద్దతిచ్చిన రెండు పార్టీలు ఇప్పుడు మాట మార్చి బీసీలకు ద్రోహాన్ని తలపెట్టాయని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో పాటు రాష్ట్ర సర్పంచులు కూడా అగ్రకులాలకే కట్టపెట్టాలనే కుట్రతోనే 42 శాతం రిజర్వేషకు ఆమోదం తెలపలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కో-చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, నాయకులు కనకాల శ్యామ్, విక్రమ్‌గౌడ్, జాజుల లింగంగౌడ్, నంద గోపాల్, బొల్లెపల్లి స్వామిగౌడ్, ఉదయ్‌కుమార్ నేత తదితరులు పాల్గొన్నారు.