ఖైరతాబాద్, సెప్టెంబర్ 16 : బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల( BC caste) సంఘాల జేఏసి సంయుక్తాధ్వర్యం లో ఈ నెల 25న సమగ్ర కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు డిమాండ్‌తో మిలియన్ మార్చ్ తరహాలో నగరంలో లక్షలాది మంది బీసీలతో కులగణన మార్చ్ నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్(Jajula Srinivas Goud) తెలిపారు. ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి, కన్వీనర్ బాలగాని బాలరాజు గౌడ్, వేముల వెంకటేశ్, బి. మణిమంజరితో కలిసి కులగణన మార్చ్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కులగణన ప్రక్రియను ప్రారంభిస్తామంటూ మార్చి 15న జీవో నం. 26ను జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్నెళ్ల పాటు స్థబ్దుగా ఉండి కులగణన చేయకుండానే ఎన్నికలు నిర్వ హించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. వారి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు తాము హైకోర్టు ను ఆశ్రయించామన్నారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చి కులగణన ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటన చేసిం దన్నారు. కాంగ్రెస్ కుటిల నీతి తమకు తెలుసునని, కేంద్రంలో రాహుల్ గాంధీ ఓ మాట చెబితే.. తెలం గాణ సీఎం రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పరిస్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిందని, జనాభాలో 136 కులాలుగా 60 శాతం ఉన్నామని, బీసీలు నిప్పులాంటి వారని, చెలగాటమాడవద్దని సూచించారు. కులగణనపై వెనక్కి తగ్గితే కాంగ్రెస్‌కు ఇదే చివరి ఎన్నికలవుతాయని, 48గంటల్లోపు సీఎం స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. 25న సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు జరిగే కులగణన మార్చ్‌కు ఇంటికొకరు, ఊరుకొక బండి వేసుకొని లక్షలాది రావాలని, తమ సత్తా ప్రభుత్వానికి చూపించాలని పిలుపునిచ్చారు.