మాదన్నపేట, జూన్ 6 : సొమ్మొక్కడిది…సోకొక్కడిది అన్నట్లు జైళ్ల శాఖకు చెందిన స్థలాన్ని ఓ మాజీ అధికారి ఓ నిర్మాణ సంస్థకు లీజుకిచ్చి యథేచ్ఛగా అద్దె వసూలు చేస్తున్నాడు. ఆ స్థలంపై ప్రస్తుత అధికారులకు అవగాహన లేకపోవడంతో కొన్ని సంవత్సరాలుగా జైళ్ల శాఖ స్థలానికి చెందిన అద్దెను యథేచ్ఛగా సదరు మాజీ అధికారే వసూలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే… మలక్పేట, ఫైర్ స్టేషన్ పక్కన సర్వే నంబర్ 136, 136/1లో జైళ్ల శాఖకు చెందిన రెండు ఎకరాల స్థలం ఉన్నది.
కొన్ని సంవత్సరాల కిందట ఈ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసుకోవడంతో జైళ్లశాఖ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న స్థలం జైళ్ల శాఖకు చెందినదిగా తీర్పు చెప్పింది. దీంతో జైళ్లశాఖ ప్రైవేటు వ్యక్తుల కబ్జాలో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకున్నది. ఇదిలా ఉండగా.. జైళ్ల శాఖకు చెందిన ఈ స్థలాన్ని 2020లో అప్పటి జైలు అధికారి వెంకటరావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థకు లీజుకు ఇచ్చారు.
ఈ క్రమంలో సదరు నిర్మాణ సంస్థ ప్రతి నెలా సదరు అధికారికే చెల్లిస్తున్నది. అయితే సదరు అధికారి ఉద్యోగ విరమణ పొందినా కూడా గత కొంత కాలంగా అద్దెను జైళ్ల శాఖకు కాకుండా ప్రైవేటు వ్యక్తులకే చెల్లిస్తున్నది. దీనిపై ఇటీవల మీడియాల్లో వచ్చిన కథనాల ద్వారా విషయం తెలుసుకున్న చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ శుక్రవారం చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.